RATAN TATA: రతన్ టాటా గురించి ముఖ్యమైన విషయాలు
RATAN TATA: రతన్ టాటా గురించి ముఖ్యమైన విషయాలు
• డిసెంబర్ 28, 1937న ముంబయిలో రతన్ టాటా జననం..
• తల్లిదండ్రులు విడిపోవడంతో నాయనమ్మ దగ్గర పెరిగిన వ్యాపార దిగ్గజం..
• నాలుగు సందర్భాల్లో పెళ్లికి దగ్గరగా వెళ్లినప్పటికీ చేసుకోని వైనం..
• 1991 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ చైర్మన్‌గా వ్యవహరించిన రతన్ టాటా..
వ్యాపార దిగ్గజం టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులు ముంబయిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు
వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రతన్ టాటా. కేవలం వ్యాపారంలోనే కాకుండా దాతృత్వంలో కూడా తనకు ఎవరు సాటిలేరని నిరూపించుకున్నారు రతన్ టాటా. రతన్ టాటా ఎంతో ఉదారమైన వ్యక్తి.
రతన్ టాటా గురించి..
1937 డిసెంబర్ 28న ముంబయిలోని ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు రతన్ నావల్ టాటా. అయితే పదేళ్ల వయసులోనే ఆయన తల్లి, తండ్రి విడిపోవటం వల్ల చిన్నారి రతన్ టాటా అలాగే తమ్ముడు జిమ్మీని నాయనమ్మ నవాజ్ బాయి టాటా పెంచి పెద్దచేశారు. దీంతో రతన్ బాల్యమంతా తన బామ్మ దగ్గరే గడిపారు. ముంబయి, సిమ్లాలోని పాఠశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి ఆపై విదేశాలకు పయనమయ్యారు. అక్కడ అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయంలో స్ట్రక్చరల్ డిజైనింగ్ ప్రధానాంశంగా 'బీఆర్క్' కోర్స్ను కంప్లీట్ చేశారు.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక టాటాకు లాస్ఏంజిలిస్లోని జోన్స్ అండ్ ఎమ్మోన్స్(Jones and Emmons) ఆర్కిటెక్చర్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఆయన సుమారు రెండేళ్ల పాటు పనిచేశారు. అప్పుడే ఆయనకు ఐబీఎంలో (IBM) ఆఫర్ వచ్చింది. అంతలోనే స్వదేశం నుంచి ఆయనకు హఠాత్తుగా ఓ కబురు వచ్చింది. అది ఆయనను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అన్నీ తానై పెంచిన నాయనమ్మ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో రతన్ టాటాను ఉన్నపళంగా ఇండియా వచ్చేయాలంటూ ఆమె నుంచి పిలుపు వచ్చింది. తమ సొంత వ్యాపారంలో టాటాలకు అండగా ఉండాలంటూ ఆమె రతన్ టాటాను కోరారు.
విదేశాల్లో చదువు పూర్తయిన తర్వాత రతన్ టాటా మొదట టాటా గ్రూప్ కంపెనీ టాటా ఇండస్ట్రీస్‌లో అసిస్టెంట్‌గా చేరారు.ఆ తర్వాత కొన్ని నెలలపాటు జంషెడ్‌పూర్‌లోని టాటా ప్లాంట్‌లో శిక్షణ తీసుకున్నారు.. శిక్షణ పూర్తయిన తర్వాత, రతన్ టాటా తన బాధ్యతలను నిర్వహించడం ప్రారంభించాడు. మొదట టాటా గ్రూప్‌లో అసిస్టెంట్‌గా చేరారు. రతన్ టాటా..1991 మార్చి నుండి డిసెంబర్ 2012 వరకు టాటా సన్స్ ఛైర్మన్‌గా రతన్ టాటా.. టాటా గ్రూప్‌ను నడిపించారు. 2008లో, రతన్ టాటాను భారత ప్రభుత్వం దేశం రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది.
రతన్ టాటాకు యువత మీద, వాళ్ళ శక్తి మీద మంచి నమ్మకం ఉంది. అందుకే Snapdeal, Paytm, Cardekho, Bluestone, Ola, Xiaomi , ఇలా 39 కి పైగా StartUp లలో పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించారు.
సాధారణంగా వ్యాపారం అంటే లాభాలు, విస్తరణ, వారసత్వం ఇలా ఉంటుంది. కానీ టాటా అలా కాదు టాటా గ్రూప్ ఎప్పుడు కూడా తన కుటుంబం కోసమో , వ్యక్తిగత ఆస్తులను కూడపెట్టడం కోసమో వ్యాపారం చెయ్యలేదు. కంపెనీకి వచ్చిన లాభాలలో 66% సమాజ సేవ కోసం ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్ ఒక్కటే. టాటా లు సంపాదిస్తున్న దాంట్లో చాల వరకు సమాజానికే వెచ్చిస్తున్నారు . అందుకే భారతీయులలో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్ గా స్థిరపడిపోయింది.
అలాగే టాటా ట్రస్ట్..
దేశం లోని మారుమూల ప్రాంతాలలోని పేద ప్రజలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తుంది. ఇప్పటికి మన దేశం తో పాటుగా విదేశాలలో చదువుకుంటున్న ఎన్నో వేళ మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్ లు అందుతున్నాయి. అలాగే తాజ్ హోటల్ లో ఉగ్రవాదుల దాడిలో గాయపడిన చనిపోయిన కుటుంబాలకు Ratan Tata ప్రత్యేకంగా సేవలందించారు. అంతే కాదు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ కి 300 కోట్ల రూపాయలు పైగా విరాళంగా ఇచ్చారు రతన్ టాటా. అందుకు గాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్ లో ఒక భవనానికి గౌరవంగా టాటా హాల్ అని పేరుని పెట్టింది. ఒక సంవత్సరం దీపావళి పండుగ కానుకగా కేన్సర్ పేషంట్ల కోసం ఏకంగా 1000 కోట్లను దానం చేసారు రతన్ టాటా..
(Ratan Tata Love Story)రతన్ టాటా ప్రేమ ప్రయాణం..
రతన్ టాటా పనిచేసే సంస్థలోనే సహ ఉద్యోగి అయిన ఓ అమెరికన్ యువతిని ఆయన ప్రేమించారు. వీరిద్దరి పరిచయం కాస్త ప్రణయంగా మారింది. పెళ్లి చేసుకొని ఓ కొత్త లైఫ్ ను స్టార్ట్ చేద్దామని కలలు కంటున్న వేళ కలవరపరిచే ఘటనలు ఆయన్ను చుట్టుముట్టాయి. దీంతో తనతో ఇండియా వచ్చేయాలంటూ ప్రేయసిని రతన్ టాటా కోరారు. కానీ దానికి ఆ యువతి తల్లిదండ్రులు ససేమిరా ఒప్పుకోలేదు. అప్పుడు ఇండో చైనా యుద్ధం నడుస్తున్నందున ఇటువంటి పరిస్థితులలో తమ కుమార్తెను ఇండియాకు పంపబోమని వారు తేల్చి చెప్పారు.
ఓ వైపు ఇండియా వచ్చేయాలన్న నాయనమ్మ కోరికను మన్నించాలా? లేకుంటే తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి అమెరికాలోనే ఉండిపోవాలా? అనే ప్రశ్నలు రతన్ టాటాను సందిగ్ధంలో నెట్టేశాయి. కానీ మాతృదేశం మీద ఆయనకున్న మమకారం, నాయనమ్మ అనురాగం ఆయన్ని తిరిగి సొంత దేశానికి వచ్చేలా చేశాయి. అలా 1962లో రతన్ టాటా భారత్ కు తిరిగి వచ్చారు. నాయనమ్మ పిలుపే రతన్ టాటా జీవితానికి మలుపైంది. కానీ ఒక్కరినే ప్రేమించి వారినే పెళ్లాడలన్న తన ఫిలాసఫీకి కట్టుబడి ఉన్న ఆయన తన ప్రేయసి స్మృతులతో అలాగే జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు.