Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్!
Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయవ్య దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ప్రస్తుతం ఈ వాయుగుండం చెన్నైకి 440 కిలోమీటర్లు, నెల్లూరుకి 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. గురువారం తెల్లవారుజామున చెన్నై, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, సత్యసాయి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేశారు. సముద్ర తీరం వెంబడి 45-55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లో అల్లకల్లోలం నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు.
నెల్లూరు జిల్లా భారీ వర్షాల కారణంగా 38 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జలదంకిలో 23.5 సెం.మీ. వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దోర్నాల, అర్థవీడు, పెద్దారవీడు, మార్కాపురం, కంభం, రాచర్ల, ముండ్లమూరులో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది. దీంతో అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రప్పించారు.
తెలంగాణపైనా వాయుగుండం ప్రభావం..
ఇక వాయుగుండం ప్రభావం తెలంగాణపైనా కనిపిస్తోంది. నిన్నటి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా చినుకులు పడుతున్నాయి. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌తోపాటు నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.