Nobel Prize: ఈ ఏడాది ఇద్దరు శాస్త్రవేత్తలకు ఫిజిక్స్ లో నోబెల్
Nobel Prize: ఈ ఏడాది ఇద్దరు శాస్త్రవేత్తలకు ఫిజిక్స్ లో నోబెల్
Nobel Prize: జాన్ జె.హాప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ.హింటన్‌లకు ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది.
Nobel Prize: ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం జాన్ జె.హాప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ.హింటన్‌ను వరించింది. మెషీన్ లెర్నింగ్ విత్ ఆర్టిఫీషియల్ న్యూరల్ నెట్‌వర్క్ ఆవిష్కరణ కోసం వీరిరువురూ చేసిన కృషికి గాను ఈ పురస్కారం ప్రకటిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది.
హాప్‌ఫీల్డ్ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో తన పరిశోధనలు చేయగా, హింటన్ టొరంటో విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ చేశారు. వీరు మెషీన్ లెర్నింగ్‌లో విశేషమైన కృషి చేశారు. వీరికి నోబెల్ ప్రైజ్ కింద 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్‌లు (1 మిలియన్ అమెరికన్ డాలర్ల) అందిస్తారు. 1901 నుంచి ఇప్పటి వరకు మొత్తం 117 సార్లు ఈ పురస్కారాన్ని ప్రకటించగా, 224 మంది దీనిని స్వీకరించారు.
ముచ్చటగా ముగ్గురు..
గతేడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌కు భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రకటించారు. పరమాణువుల్లోని (Atoms) ఎలక్ట్రాన్ డైనమిక్స్‌ను అధ్యయనం చేసేందుకు, కాంతి తరంగాల ఆటోసెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకుగాను వీరికి నోబెల్ పురస్కారాన్ని అందజేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది.భారీ నగదు బహుమతి
స్వీడెన్కు చెందిన గొప్ప ఇంజినీర్, రసాయన శాస్త్రవేత్త, వ్యాపారవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ కోరిక మేరకు ఏటా డిసెంబర్ 10న నోబెల్ ప్రైజ్ అందిస్తూ వస్తున్నారు. నోబెల్ కమిటీ వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ పురస్కారాల కోసం ఎంపిక చేస్తుంది.సోమవారం (2024 అక్టోబర్ 7న) క్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్కున్కు వైద్య రంగంలో నోబెల్ పురస్కారం ప్రకటించారు. మైక్రో ఆర్ఎన్ఏపై చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నట్లు తెలిపింది. ఈ రోజు (అక్టోబర్8 న) భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లు ప్రకటించారు. అక్టోబరు 14 వరకు ఇలా ప్రతి రోజూ ఒక్కో రంగంలో విశేష కృషి చేసిన పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటిస్తుంటారు. బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్య రంగంలో నోబెల్ అందుకునే వారి వివరాలు తెలియజేస్తారు. ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఎవరికి దక్కనుందో శుక్రవారం తేలనుంది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అవార్డు విజేతను వచ్చే సోమవారం తెలియజేస్తారు. నోబెల్ పురస్కారం కింద మిలియన్ డాలర్ల నగదు బహుమతి అందిస్తారు.