Nara Lokesh: త్వరలో వాట్సాప్ ద్వారా బర్త్, డెత్ సర్టిఫికెట్లు..విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్
Nara Lokesh: త్వరలో వాట్సాప్ ద్వారా బర్త్, డెత్ సర్టిఫికెట్లు..విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్
క్యాలండర్ ప్రకారమే సూపర్ – 6 పథకాల అమలు
జగన్ లా కల్లబొల్లి కబుర్లు చెప్పం, చెప్పింది చేస్తాం
అసత్యవార్తలు రాస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం
ఎంఆర్ పి ధరలకే మద్యం విక్రయించేలా పకడ్బందీ చర్యలు
విశాఖపట్నంలో రీజనల్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు
విశాఖపట్నం విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం, పీపుల్స్ మోటివేషన్:-
ఎర్ర బుక్కు చూస్తే జగన్ ఎందుకు భయపడుతున్నారు? ఏ అధికారులు, వైసిపి నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బంది పెట్టారో వారిపై చర్యలు తీసుకుంటానని చెప్పాను, దానికే నేను కట్టుబడి ఉన్నానని రాష్ట్ర విద్య, ఐటిశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టంచేశారు. విశాఖ కోర్టు వెలుపల మంత్రి లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ...నేను అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్నాను, నేను పాదయాత్ర చేస్తుంటే జిఓ 1 తెచ్చి అడ్డుకోవాలని చూశారు, గతంలో టిడిపి తరపున వాదించిన అడ్వకేట్లపై కూడా దాడులు చేశారు, వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. 2019లో బ్లూమీడియా సాక్షి విశాఖ ఎడిషన్ లో నాపై ఫేక్ న్యూస్ పబ్లిష్ చేసింది. దానిపై నేను 75కోట్లకు పరువునష్టం దావా వేశాను. వాదనలు, క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగుతోంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ వాహనంగానీ, వసతి వినియోగించలేదు. ఫ్లయిట్ టిక్కెట్లు కూడా నేనే కొనుక్కుంటున్నాను. ప్రజాజీవితంలో మేం బాధ్యతగా మెలిగే వాళ్లం. మూడోసారి విశాఖకు వచ్చాను. నేను పాదయాత్రలో వాడిన బస్సులోనే విశాఖ పార్టీ కార్యాలయంలో బసచేస్తున్నా. టిడిపి ఆవిర్భవించాక ఆరుసార్లు అధికారాన్ని చేపట్టినప్పటికీ మేం ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు, ప్రజల జీవన స్థితిగతులను మార్చడానికే టిడిపి అధికారాన్ని వినియోగించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్ డిఎ ప్రజాకోర్టులో విజయం సాధించింది, విశాఖ కోర్టులో కూడా మేం విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. ఇప్పటికీ సాక్షిలో ఎటువంటి మార్పు కనబడటం లేదు, 2014-19, 2019-24లో మాపై అనేక తప్పుడు వార్తలు ప్రచురించారు, అందుకే వైసిపిని ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు, ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు చెబితే బాగుంటుంది. తప్పుడు వార్తల పరంపర కొనసాగిస్తే ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీలు వారిని వదిలిపెట్టవు. చట్టప్రకారం నోటీసులు ఇచ్చి, కేసులు పెడతాం. తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదు.
క్యాలండర్ ప్రకారమే సూపర్ – 6 పథకాల అమలు!
సూపర్ సిక్స్ పథకాల అమలుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిస్తూ పథకాల అమలుకు మావద్ద క్యాలండర్ ఉంది. దాని ప్రకారమే ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నాం. ముందుకు ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి పెన్షన్ సొమ్ము పెంచి ఇస్తున్నాం. అన్నాక్యాంటీన్లు ప్రారంభించాం. నిరుద్యోగులకు మెగా డిఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చాం. విద్యావ్యవస్థను కూడా బలోపేతం చేస్తున్నాం. వివిధ సామాజికవర్గాలకు ఇచ్చిన మాట ప్రకారం పలు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. జగన్ మాదిరి కల్లబొల్లి కబుర్లు చెప్పం. గత ఎన్నికల సమయంలో ఆయన చెప్పిన సంపూర్ణ మద్య నిషేధం, సిపిఎస్ రద్దు ఏమయ్యాయి? నోటికొచ్చినట్లు మాట్లాడటం కరెక్టు కాదు.
మద్యం ఎంఆర్ పి ధరలకు అమ్మాల్సిందే!
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మద్యం షాపుల్లో ఎంఆర్ పి ధరలకే మద్యం విక్రయించాల్సిందే. కొత్తగా ప్రారంభించిన ప్రైవేటు మద్యం షాపుల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నారన్న వార్తలపై స్పందిస్తూ షాపులు ప్రారంభించి రెండురోజులే అయింది. పకడ్బందీగా విజిలెన్స్ ఏర్పాటు చేసి, ఎంఆర్ పి అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వంలో అక్రమ మధ్యంపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
విశాఖలో రీజనల్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు
ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ లో భాగంగా సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేలా యువ ఐఎఎస్ అధికారితో ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఈడిబి)ని ఏర్పాటుచేశాం. దీంతోపాటు రీజనల్ బోర్డులు కూడా ఏర్పాటుచేసి, సులభతరంగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. విశాఖలో కూడా ఒక రీజనల్ బోర్డు ఏర్పాటుచేస్తాం. దీనిద్వారా నిరుద్యోగ యువతకు లక్షలాది ఉద్యోగాలు లభిస్తాయి. 2029లో ప్రభుత్వం మారిపోతే పరిస్థితి ఏమిటన్న ఆందోళన పెట్టుబడిదారుల్లో ఉండటం సహజమే. జగన్ ప్రభుత్వ హయాంలో చాలా పరిశ్రమలు రాష్ట్రంనుంచి పరారయ్యాయి. అమర్ రాజా బ్యాటరీస్ పై వేధింపులకు పాల్పడ్డారు. దీనివల్ల అంతిమంగా నష్టపోయింది రాష్ట్రప్రజలు. మళ్లీ రాష్ట్రంలో జగన్ అరాచక పాలన రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదే. త్వరలోనే విశాఖలో టిసిఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మరికొన్ని కంపెనీలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. కార్యరూపం దాల్చాక వాటిపై క్లారిటీ ఇస్తా. ఇచ్చిన మాట ప్రకారం అయిదేళ్లలో నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. ఎన్ డిఎ ప్రభుత్వం ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనీయం. దీనిపై ఇప్పటికే ఎంపి, ఎమ్మెల్యేలందరం సమావేశమై క్లారిటీ ఇచ్చాం.
న్యాయపరమైన చిక్కులు తొలగించి నామినేటెడ్ భర్తీ
నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనాలోచిత చర్యలవల్ల పలు కార్పొరేషన్లు కాంప్లిగేటెడ్ గా మారాయి. న్యాయపరమైన చిక్కులను తొలగించి పదవులను భర్తీచేస్తాం. విశాఖతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎంపి, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదన్నది అవాస్తవం. తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద కుటుంబం, చిన్నచిన్న సమస్యలు ఉంటే కూర్చుని పరిష్కరించుకుంటాం. బ్లూ మీడియాకు ఉత్సుకత ఎందుకు?
త్వరలో వాట్సాప్ ద్వారా బర్త్, డెత్ సర్టిఫికెట్లు
బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి గత ప్రభుత్వంలో ఎటువంటి విధివిధానాలు లేవు, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్టీజిఎస్ శాఖ ద్వారా త్వరలోనే వాట్సాప్ ద్వారా బర్త్, డెత్ తోపాటు క్యాస్ట్, మ్యారేజి వంటి సర్టిఫికెట్లను ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా వాట్సాప్ ద్వారా అందించేలా చర్యలు తీసుకుంటాం. ఉద్యోగుల టిఎ, డిఎ, సరెండర్ వంటివి గత ప్రభుత్వం 8వేల కోట్లు పెండింగ్ లో పెట్టింది, వాటన్నింటినీ ఒకేసారి ఇవ్వడం కష్టం, పద్ధతి ప్రకారం వాటన్నింటినీ అందజేసేలా చర్యలు తీసుకుంటాం.
రుషికొండపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం
మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక్కడు ఉండటానికి రుషికొండపై 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎన్ జిటి 200 కోట్లు ఫైన్ వేసింది. ఒక వ్యక్తి బతకడానికి ఇంత సొమ్ము ఖర్చుచేయడం అవసరమా? ఈ డబ్బుతో లక్షలమంది గూడులేని పేదలకు ఇళ్లు లభించేవి. రుషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలనే విషయమై ఆలోచించి ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంటాం. అప్పటివరకు దానిని జాగ్రత్తగా పరిరక్షించాల్సిఉంది. అందుకోసం ప్యాలెస్ చుట్టూ ఉన్న రెండు రోడ్లలో ఒకటి మూసివేసి ఉంచారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రెండో రహదారిని ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తాం.
నవంబర్ – డిసెంబర్ లో పూర్తిస్థాయి బడ్జెట్!
నవంబర్, డిసెంబర్ నెలల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం. విశాఖలో ప్రీహోల్డింగ్ భూములపై పూర్తిస్థాయి నివేదిక వచ్చాక రెవిన్యూ మంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన 117 జిఓపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నెలరోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటాం. ఉచిత ఇసుక విధానంలో లోపాలను సరిచేస్తాం. 2019లో ఏధరకు ఇసుక లభించిందో అదే ధరకు ఇసుక లభ్యమయ్యేలా చూస్తాం. యూనివర్సిటీల్లో కొత్త విసిల నియామకానికి సెర్చి కమిటీ ఏర్పాటు కావాల్సి ఉంది. విసిల నియామకం పూర్తిచేశాక ఆయా యూనివర్సిటీల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తాం. పాఠశాలల ఆకస్మిక తనిఖీల్లో భాగంగా త్వరలో ఏజన్సీలోని పాఠశాలలను కూడా సందర్శిస్తానని మంత్రి లోకేష్ చెప్పారు....