JEE Exams Structure: ఎన్టీఏ కీలక అప్డేట్.. ఇకపై జేఈఈ పరీక్ష విధానం ఇలా!!
JEE Exams Structure: ఎన్టీఏ కీలక అప్డేట్.. ఇకపై జేఈఈ పరీక్ష విధానం ఇలా!!
ఎన్‌ఐటీల్లో బీటెక్ సీట్లు భర్తీకీ జేఈఈ..
గత పద్ధతిలోనే పరీక్షలు ఉంటాయి..
2025 జేఈఈ పరీక్ష నుంచి మాత్రం ఆప్షనల్ ప్రశ్నలు ఉండవ్..
కీలక నిర్ణయం తీసుకున్న ఎన్టీఏ..
JEE Exams Structure: జేఈఈ మెయిన్ పరీక్ష విధానంలో కీలక మార్పులు జరగనున్నాయి. గత మూడేళ్ల నుంచి సెక్షన్ బీలో కొనసాగుతున్న ఛాయిస్ ఆప్షన్ ఇక ఉండదు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం ప్రకటించింది. సెక్షన్ బీ లో ఆప్షనల్ ప్రశ్నలు ఉండవని వెల్లడించింది. కరోనా మహమ్మారి సమయంలో విద్యార్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు ఏర్పడిన ఆటంకాల నేపథ్యంలో 2021 జేఈఈ మెయిన్స్ లో ఎన్టీఏ మార్పులు చేసింది. సెక్షన్ బీలో 10 ప్రశ్నలు ఇచ్చి కేవలం 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలని విద్యార్థులకు ఆప్షన్ ఇచ్చింది. 2024 వరకు అదే విధానాన్ని కొనసాగించింది ఎన్టీఏ. కానీ 2025 జేఈఈ పరీక్ష నుంచి మాత్రం ఆప్షనల్ ప్రశ్నలు ఉండవని తాజాగా ప్రకటించింది. 2021కు ముందు ఉన్న పద్ధతిలోనే పరీక్ష ఉంటుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. సెక్షన్ బీలో 5 ప్రశ్నలే ఇవ్వనున్నట్లు, ఐదింటికీ సమాధానాలు రాయాల్సి ఉంటుందని తెలిపింది.
జేఈఈ పరీక్ష విధానం ఇలా!
జేఈఈ మెయిన్ ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 ఎన్‌ఐటీల్లో బీటెక్ సీట్లు భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్‌లో 75 ప్రశ్నలు, ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఇచ్చేవారు. గణితం, భౌతిక, రసాయనశాస్త్రాల నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఉండేవి. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు వెసులుబాటు ఇచ్చేందుకు ప్రతి సబ్జెక్టులో ఛాయిస్ ప్రశ్నలు ఇచ్చారు. జేఈఈ మెయిన్ 2021 నుంచి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇస్తూ వచ్చారు. ప్రతి సబ్జెక్టులో ఏ, బీ సెక్షన్లు ఉండేవి. సెక్షన్ ఏలో 20 ప్రశ్నలకు మొత్తం జవాబులు రాయాలి. సెక్షన్ బీలో 10 ఇచ్చి అయిదు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ఛాయిస్ ఇచ్చారు. ఈసారి నుంచి ఆ ఛాయిస్‌ను విరమించుకుంటున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది.
ఏదైనా సమాచారం లేదా అప్డేట్ల కోసం, విద్యార్థులు NTA వెబ్‌సైట్ nta.ac.in లేదా JEE మెయిన్ వెబ్‌సైట్ jeemain.nta.nic.in ని సందర్శించాలని సూచించింది.