CENTRAL GOVT: డీఓపీటీ షాక్.. త్వరలో ఆ IAS, IPS లు ఆంధ్రప్రదేశ్ కూ..!!
CENTRAL GOVT: డీఓపీటీ షాక్.. త్వరలో ఆ IAS, IPS లు ఆంధ్రప్రదేశ్ కూ..!!
పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు డీఓపీటీ షాక్ - కేడర్ మార్పు కోసం చేసుకున్న విజ్ఞప్తులు తిరస్కరణ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (డీఓపీటీ) షాక్ ఇచ్చింది. కేడర్ మార్పు కోసం చేసుకున్న విజ్ఞప్తులను తిరస్కరించింది. కేటాయించిన కేడర్ రాష్ట్రాల్లోనే కొనసాగాలని ఆదేశాలిచ్చింది.
వారి అభ్యర్థనను కొట్టిపారేసిన కేంద్రం..
ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌లకు నోటీసులు జారీ చేసింది. వారిలో ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాణీప్రసాద్, మల్లెల ప్రశాంతితో పాటు ఐపీఎస్‌లు అంజనీ కుమార్, అభిషేక్ మొహంతి తదితరులు తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. అయితే, వారి అభ్యర్థనను కొట్టిపారేసిన కేంద్రం, వారందర్నీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి వెళ్లాలని ఆదేశించింది. వీరందరినీ తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ డీవోపీటీ (Department of Personnel and Training) ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 16వ తేదీలోగా ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ అధికారులు ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాణి ప్రసాద్, వాకాటి కరుణ, ఎం. ప్రశాంతి తదితరులకు నోటీసులు ఇచ్చింది. ఏపీలో పని చేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారులు ఎస్ ఎస్ రావత్, అనంత్ రాము, సృజన, శివశంకర్ లోతేటిలకు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా ఏపీకి వెళ్లాలని ఐపీఎస్‌లు అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతిని ఆదేశించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీ, తెలంగాణలకు అధికారులను కేంద్రం సర్దుబాటు చేసింది. అయితే ఆ సమయంలో కొంత మంది అధికారులు మాత్రం అభ్యంతరాలను వ్యక్తం చేశారు. వివిధ కారణాలను చూపిస్తూ తమను తెలంగాణ కేడర్‌కు మార్చాలంటూ కోరారు. ఇదే విషయంపై గతంలో క్యాట్‌ను (Central Administrative Tribunal) కూడా ఆశ్రయించారు. వారి అభ్యర్థనను అంగీకరించిన క్యాట్, అప్పట్లో వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది.
గత మార్చి నెలలో దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు, అభ్యర్థనలను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో అభ్యంతరాల పరిశీలనకు విశ్రాంత ఐఏఎస్ అధికారి దీపక్‌ను నియమించింది. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం, అధికారుల అభ్యర్థనలను తోసిపుచ్చుతూ తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.