వీధి కుక్కల బెడదను అరికడతాం
వీధి కుక్కల బెడదను అరికడతాం
• రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖల మంత్రి టిజి భరత్
• శునకాల దాడిలో గాయపడ్డ బాధితులకు రూ.10 వేల ఆర్థికసాయం అందజేత
కర్నూలు అక్టోబర్ 08 (పీపుల్స్ మోటివేషన్):-
నగరంలో వీధి కుక్కల బెడదను అరికడతామని రాష్ట్ర పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ వాణిజ్య శాఖల మంత్రి టిజి భరత్ అన్నారు. మంగళవారం నగరపాలక కౌన్సిల్ హాలులో సెప్టెంబర్ 30 తేదీన పాతబస్తీ, జోహరపురం ప్రాంతాల్లో వీధి కుక్కల దాడిలో గాయపడ్డ 36 మంది బాధితులకు నగరపాలక సంస్థ తరపున ఒక్కొక్కరికి రూ.10 అర్థిక సహాయాన్ని మంత్రి భరత్, అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత నెల తాను ప్రభుత్వ అతిథి గృహంలో సమీక్షలో ఉండగా, చిన్నారులపై పిచ్చికుక్కల దాడి విషయాన్ని తెలిసి, అర్థగంటకే కలెక్టర్, కమిషనర్‌తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లానన్నారు. బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించామన్నారు. అదేరోజు ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించామన్నారు. గత రెండు నెలలుగా సునకాల సంతాన నియంత్రణ ఆపరేషన్లు ఆగిపోయాయని, వాటిని మళ్లీ ప్రారంభించినందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రానున్న రెండు నెలల్లో ఈ సమస్యకు జవాబుదాతనంతో శాశ్వత పరిష్కారం చూపాలని నగరపాలక అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందని, ఇతర నగరాల్లో అనుసరిస్తున్న చర్యలను తెలుసుకోవాలని, నగరంలో పూర్తి స్థాయిలో కుక్కల బెడద నివారణకు అవసరమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సూచించినట్లు తెలిపారు. వెంటనే వీధి కుక్కల సంతాన నియంత్రణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి, ఆపరేషన్ ప్రారంభించాలని ఆదేశించారు. మొన్న విజయవాడ వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో వచ్చి అధికారులను ఏ విధంగా అప్రమత్తం చేసి పనిచేయించారో రాష్ట్ర ప్రజానీకం గమనించాలన్నారు. ప్రజలకు కష్టాలు వస్తే, తాము ఎప్పుడు ముందు ఉంటామన్నారు. ఇదే స్ఫూర్తితో తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, సంతాన నియంత్రణ ఆపరేషన్ల సామర్థ్యాన్ని పెంపునకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చిన వివరాల ప్రకారం 36 మంది బాధితులకు ఆర్థిక సాయం అందజేశమన్నారు. 30 మందికి చెక్కుల రూపంలో, 6 మందికి నగదు రూపంలో ఆర్థిక సాయం అందజేసినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆరోగ్యధికారి కె.విశ్వేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ పరమేష్ పాల్గొన్నారు.