బన్ని ఉత్సవం ప్రశాంతంగా జరుపుకోవాలి... కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్
బన్ని ఉత్సవం ప్రశాంతంగా జరుపుకోవాలి... కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్
• దేవరగట్టు పరిసర గ్రామాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాం.
• అక్రమ మద్యం , నాటుసారా కట్టడికి గట్టి చర్యలు చేపట్టాం.
• 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం .
• ఘర్షణలకు పాల్పడే వారిని , అక్రమ మద్యం రవాణా చేసే వారిని గుర్తించి 148 మంది పై బైండోవర్ లు నమోదు చేశాం.
• 100 Night vision సిసి కెమెరాలు, 700 LED లైట్లు, 5 డ్రోన్ కెమెరాలు , వీడియో కెమెరాల నిఘాలో బన్ని ఉత్సవం.
• బన్ని ఉత్సవానికి 800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత.
• బన్ని ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చే చిన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.
• సంప్రదాయాన్ని గౌరవిస్తాం... పోలీసు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠినచర్యలు.
కర్నూలు, అక్టోబర్ 9 (పీపుల్స్ మోటివేషన్):-
దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 12 (శనివారం) వ తేది రాత్రి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగే దేవరగట్టు శ్రీ మాలమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవం ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టిందని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ బుధవారం తెలిపారు.
ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బన్ని ఉత్సవానికి 800 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో 7 మంది డిఎస్పీలు, 42 మంది సిఐలు, 54 మంది ఎస్సైలు, 112 మంది ఎఎస్సైలు మరియు హెడ్ కానిస్టేబుళ్ళు, 362 మంది కానిస్టేబుళ్ళు, 50 మంది స్పెషల్ పార్టీ పోలీసులు , 3 పట్లూన్ల ఎఆర్ పోలీసులు , 95 మంది హోంగార్డులు బన్ని ఉత్సవం బందోబస్తు విధులలో పాల్గొంటారని తెలిపారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసిందన్నారు. బన్ని ఉత్సవంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి, అల్లర్లు, నిప్పులు విసరడం వంటివి చేస్తే అలాంటి వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాము.
బన్ని ఉత్సవంలో మద్యం సేవించి రింగులు గల కర్రలతో ఉత్సవంలో పాల్గొనడం వల్ల తలలకు గాయాలు కావడం వంటి దుష్పరిమాణాలపై దేవరగట్టు చుట్టు ప్రక్కల నెరణికి,కొత్తపేట, అరికెర, ఎల్లార్తి, గ్రామాలలో పోలీసు మరియు రెవిన్యూ శాఖల సమన్వయంతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము.
దేవరగట్టు పరిసర గ్రామాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహిస్తున్నాము. ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా ఇంతకు మునుపు ఘర్షణల్లో పాల్పడ్డ వారిని మరియు అక్రమ మద్యం రవాణా చేసే వారిని గుర్తించి 148 మందిని బైండోవర్ చేసి అదుపులోకి తీసుకున్నాం. దేవరగట్టు చేరుకునే పరిసర గ్రామాల్లోనూ, ప్రధాన రహాదారుల్లోనే కాక చిన్న చిన్న దారుల్లోనూ బందోబస్తు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఉత్సవంలో ఎలాంటి రక్త గాయాలు కాకుండా పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. బన్ని ఉత్సవంలో ఫైర్ సిబ్బంది, వైద్యసిబ్బంది, అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం.
బన్ని ఉత్సవం ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహాకరించాలని, భక్తుల్లో మార్పు రావాలని, ఈ కర్రల సమరానికి స్వస్తి పలకాలని దేవరగట్టు పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ విజ్ఞప్తి చేశారు.