అన్నదాత ఆశలపై నీళ్లు చల్లిన తుఫాన్..
అన్నదాత ఆశలపై నీళ్లు చల్లిన తుఫాన్..
- అకాల వర్షాలతో మొక్కజొన్న ధాన్యం వర్షార్పణం..
- మూడు నెలలపాటు శ్రమించిన రైతు కష్టం..
- మూడు రోజులలో వర్షార్పణం..
- ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వినతి..
నంద్యాల, అక్టోబర్ 19 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల జిల్లా వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు కడగండ్ల మిగిల్చాయి. జిల్లాను వణికిస్తున్న తుఫాను ప్రభావంతో వర్షాలు పడుతూ ఉండడంతో నియోజకవర్గంలోని మొక్కజొన్న రైతులు నిండా మునిగిపోయారు. ఒకవైపు తుఫాను ప్రభావంతో పొలాల్లో సాగు చేస్తున్న పంటలు దెబ్బతింటుండగా కోతకు వచ్చిన మొక్కజొన్న ధాన్యాన్ని కోసి రోడ్లపై ఆరబోసుకున్న రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వర్షం తాకిడికి మొక్కజొన్న గింజలు రంగు మారడంతో పాటు రోడ్లపైనే మొలకెత్తడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వేలు, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తీరా పంట చేతికి వచ్చిన సమయానికి తుఫాను కారణంగా దెబ్బతినింది. ఆళ్లగడ్డ మండలంలోని బాచాపురం, నరసాపురం, అహోబిలం, ఇటు ఆళ్లగడ్డ -కాసింతల బైపాస్ రోడ్డులో కిలోమీటర్ల మేర మొక్కజొన్న ధాన్యాన్ని రైతులు రోడ్లపై ఆరబెట్టుకున్నారు. తుఫాను కారణంగా ధాన్యంపై టార్పలిన్ పట్టలు కప్పి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ధాన్యం తడిసిపోయి మొలక ఎత్తడంతో మూడు నెలలపాటు శ్రమించిన రైతు కష్టం మూడు రోజులలో ఆవిరి అయిపోయింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆళ్లగడ్డ ప్రాంతా రైతులు కోరుతున్నారు.