పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు..
పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు..
ప్రభుత్వంపై నమ్మకంతో 90 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు
కల్తీ మద్యాన్ని పూర్తిగా నిషేధించి కొత్త మద్యం పాలసీతో ముందుకొచ్చాం
వ్యాపారం చేసుకునే వారికి స్వేచ్ఛనిచ్చేలా మద్యం పాలసీ అమలు చేస్తున్నం
షాపుల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దుకు వెనుకాడబోం
జగన్ రెడ్డి నిర్వాకంతోనే రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక ఇక్కట్లు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు కేసుల గురించి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
అధికారంలో అడ్డగోలుగా వ్యవహరించిన జగన్ రెడ్డి ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటు
- మీడియాతో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
నూతన ఎక్సైజ్ పాలసీ 2024ని అత్యంత పారదర్శకంగా అమలు చేసిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
కానూరులోని ఏపీఎండీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా పూర్తి పారదర్శకంగా పాలసీని అమలు చేసి చూపించాం. అత్యంత పకడ్బందీగా షాపుల కేటాయింపు జరిగింది.
గత ప్రభుత్వం ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో చేసిన దుర్మార్గాలకు, స్కాములకు నేటితో తెరదించాం. 3396 షాపులకు అక్టోబర్ 1 నుండి దరఖాస్తులు ఆహ్వానించగా 89,882 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించాం. తద్వారా ప్రభుత్వానికి రూ.1797 కోట్ల ఆదాయం సమకూరింది. రాజకీయ ఒత్తిళ్లకు అవకాశం లేకుండా షాపుల్ని కేటాయించాం.
పారదర్శకంగా షాపుల కేటాయింపు..
గతంలో ఒక్కో షాపునకు సగటున 18 దరఖాస్తులు వస్తే.. ఇప్పుడు ఏకంగా 26.7 దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కో షాపునకు వందకు పైగా దరఖాస్తులు కూడా వచ్చాయి. 2015-17లో 4380 షాపులకు 65,208 దరఖాస్తులు రాగా రూ.225 కోట్ల ఆదాయం వచ్చింది.
2017-19లో 4377 షాపులకు 76,329 దరఖాస్తులు రాగా రూ.422 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. కానీ ఇప్పుడు ఏకంగా 89,882 దరఖాస్తులు, రూ.1797 కోట్ల ఆదాయం రావడం సంతోషకరం.
ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ఈ దరఖాస్తులు నిదర్శనం. డ్రా నిర్వహణ కూడా ప్రశాంతంగా జరగడమే కాకుండా పారదర్శకంగా నిర్వహించాం. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఇంత విజయవంతం చేసినందుకు కమిషనర్, సెక్రటరీ, ఎక్సైజ్ సిబ్బంది, సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు.
తప్పు చేస్తే ఏ ఒక్కరినీ క్షమించబోం..
తప్పు చేస్తే ఏ ఒక్కరినీ వదిలేది లేదు. నిబంధనలకు విరుద్ధంగా షాపులు నిర్వహించినా, మద్యం అమ్మకాలు జరిగినా కఠినమైన చర్యలుంటాయి. సిండికేట్ జరిగినట్లు ప్రస్తుతానికి ఎక్కడా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అలాంటి ఘటనలు జరిగినట్లు వెలుగులోకి వస్తే చర్యలుంటాయి. ప్రభుత్వంపై నమ్మకంతో మహిళలు, ఉద్యోగులు, యువత కూడా దరఖాస్తులు చేసుకున్నారు.
గుడి, బడికి చుట్టు పక్కల ఎక్కడైనా 100 మీటర్లలోపు ఉండడానికి వీల్లేదు. ఆమేరకు కట్టుబడి ఉన్నాం. సెబ్ విలీనంతో ఎక్సైజ్ శాఖ కూడా బలోపేతమైంది. తద్వారా షాపులపై విజిలెన్స్ కూడా అంతే కఠినంగా ఉంటుంది. ఎంఆర్‌పీ ధరల ఉల్లంఘనలు, బెల్టు, కల్తీ మద్యం అమ్మకాలపై కఠినంగా చర్యలుంటాయని హెచ్చరిస్తున్నాం.
గతంలో తయారీ నుండి అమ్మకం వరకు ఒకరి చేతుల్లోనే..
గత పాలకులు ఎవరికీ వ్యాపారం చేసుకునే వీలు లేకుండా ఏకపక్షంగా షాపులన్నింటినీ హస్తగతం చేసుకున్నారు. మద్యం తయారీ నుండి అమ్మకం వరకు అన్ని వ్యవస్థల్నీ గుప్పిట్లో పెట్టుకుని మద్యం మాఫియాను నడిపించారు. ప్రభుత్వ ఆధీనంలో షాపుల్ని పెట్టుకుని ప్రజల ప్రాణాలు తీశారు.
దరలు పెంచి పేదల జేబులు గుల్ల చేశారు. అలాంటి అరాచకాలకు అవకాశం లేకుండా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు కూడా అభినందనీయం. నాణ్యమైన మద్యాన్ని అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం.
గత ఐదేళ్లు సగటున ఏటా రూ.25 వేల కోట్ల ఆదాయం ఉంది. ప్రస్తుతం 10శాతం పెరిగి ఏటా రూ.30 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాం.
ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక లాంటి ప్రాతాలకు మద్యం అక్రమ రవాణా జరగకుండా తగు చర్యలు తీసుకుంటాం. త్వరలోనే టెండర్ కమిటీ ఏర్పాటు చేసి కొత్త బ్రాండ్లకు అనుమతులు మంజూరు చేస్తాం. ఇప్పటికే నమోదైన బ్రాండ్లు షాపులు ప్రారంభం నుండే అందుబాటులో ఉంటాయి. గీత కార్మికులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి వారికి కేటాయించిన షాపుల్ని భర్తీ చేస్తాం.
నేటి ఇసుక కొరతకు కారణం జగన్ రెడ్డే..
ఇసుక గురించి జగన్ రెడ్డి మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. గత ఐదేళ్ల పాలనా కాలంలో జగన్ రెడ్డి చేసిన దుర్మార్గపు పనుల కారణంగానే నేడు ఇసుకకు అవస్థలు పడాల్సి వస్తోంది. ఎన్జీటీ, సుప్రీంకోర్టుల్లో కేసులకు కారణం ఎవరో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. జేపీ పవర్ వెంచర్స్, ప్రతిమ, జేసీ కేసీ అనే సంస్థల్ని తీసుకొచ్చి ఇసుక మొత్తాన్ని తన జేబుల్లో నింపుకున్నారు. రూ.1000 కోట్లకు పైగా బకాయిలున్నప్పటికీ క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. కోర్టులు రూ.8 కోట్లకు పైగా జరిమానాలు విధించాయి. దీనికి కారనం ఎవరో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
మేము అధికారంలోకి వచ్చే నాటికి 80 లక్షల టన్నులకు పైగా ఇసుక అందుబాటులో ఉందంటూ జగన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదం. ఐదేళ్లలో ఏ రోజు కూడా ఎప్పుడు, ఎక్కడ ఎంత ఇసుక అందుబాటులో ఉందో ఏ రోజు కూడా చెప్పలేదు. అలాంటి వ్యక్తి ఈ రోజు ట్విట్టర్లో పిచ్చి కూతలు కూస్తున్నాడు. మేము అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇసుక వివరాలన్నీ బయటపెట్టాం. వర్షాకాలంలో ఇసుక తవ్వకాలకు ఇబ్బందులుంటాయని గుర్తించి స్టాక్ యార్డుల్లోని ఇసుకను ప్రజలకు అందించాం. ఆ మేరకు 35 లక్షల టన్నుల ఇసుక మాత్రమే అందుబాటులో ఉన్నట్లు మేం బయట పెట్టాం. స్టాక్ యార్డుల నుండి ఇసుక అందించడంతో ధరల్లో కాస్త వ్యత్యాసాలున్న మాట వాస్తవం. రీచులన్నీ ప్రారంభిస్తే ఇసుక కొరత తగ్గి, ధరలు తగ్గుముఖం పడతాయి. కానీ రీచులన్నీ ప్రారంభించడానికి ఎన్జీటీ, సుప్రీంకోర్టుల్లో కేసులు అడ్డంకిగా మారాయి. ఈ ఘోరాలన్నీ బయటపెట్టకుండా నిందలేసి సర్ది చెప్పుకోవడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలి.
త్వరలోనే బోట్ మెన్ అసోసియేషన్ల ద్వారా కూడా ఇసుక తీసుకొస్తాం. జగన్ రెడ్డి టన్ను ఇసుక రూ.475కి అమ్మితే.. మేము సీనరేజి, లోడింగ్ ఛార్జెస్ మాత్రమే నామమాత్రంగా వసూలు చేస్తూ ప్రజలకు అందిస్తున్నాం. కొన్ని చోట్ల ఉద్దేశ్యపూర్వకంగా ఎక్కువ ధరలకు ఇసుక అమ్ముతున్నారనే ఫిర్యాదుల్ని సైతం పరిష్కరించాం. ఇసుక అవసరం ఉన్న వారు పోర్టల్ ద్వారా బుక్ చేసుకుని ఇసుక తీసుకెళ్లొచ్చు. సీనరేజి ధరలు, లోడింగ్ ఛార్జీలు చెల్లించి ఇసుక తీసుకెళ్లొచ్చు. సొంత వాహనాలు ఉన్నవారు ఎవరైనా గానీ ఇసుకను ఉచితంగా పొందొచ్చని తెలియజేస్తున్నాం.
ప్రజలకు ఇసుక ఉచితంగా ఇవ్వడమే లక్ష్యం..
ఈ నెల 16 నుండి 48 రీచులు అందుబాటులోకి రాబోతున్నాయి. పట్టా భూముల్లో
ఇసుక తవ్వకాలకు అనుమతులిస్తాం. డిస్ట్రిక్ట్ శాండ్ కమిటీ నిర్ణయించిన ధరలకు మాత్రమే అమ్మేలా చర్యలు తీసుకుంటాం. కొత్త రీచుల్ని ప్రైవేటు వ్యక్తుల ద్వారా గుర్తించేందుకు సంబంధించి కేబినెట్లో చర్చించి ఆమోదం తీసుకోవాలని భావిస్తున్నాం. వాటి ద్వారా కూడా అవసరమైన మేర ఇసుక అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటాం. అదే సమయంలో రోబో శాండ్ విషయంలో కూడా ప్రత్యేకమైన పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నం. తద్వారా ఇసుక కొరతను అధిగమించగలుగుతాం.
గత ప్రభుత్వ హయాంలో జరిగి అవకతవకలు, తప్పిదాలు, కేసుల కారణంగానే ప్రజలు ఇసుక పొందడానికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎక్కడికక్కడ ఇసుక అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నిస్తోంది. 16వ తేదీ నుండి పూర్తి స్థాయిలో ఇసుక అందించి తీరుతాం. టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఎక్కడైనా ఇసుక అక్రమాలు జరిగితే ఫిర్యాదు చేయొచ్చని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.