ఎవరైనా అనుమతులు లేకుండా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా చర్యలు తప్పవు
ఎవరైనా అనుమతులు లేకుండా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా చర్యలు తప్పవు...
జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా అటువంటి వారి పై ప్రేలుడు పదార్థాల చట్టం, ఐపిసి సెక్షన్స్ ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ తెలిపారు.
ఈ సంధర్బంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో కర్నూలు , ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్ డివిజన్ లలో టపాసుల విక్రయాలు జరిగే ప్రాంతాలలో పలు జాగ్రత్తలు, సూచనలు పాటించాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులకు ఆదేశించారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...
ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ విక్రయించాలని విక్రయదారులకు తెలియజేయాలన్నారు. చట్టం సూచించిన నిబంధనలు పక్కాగా పాటించాలన్నారు. కేటాయించిన ప్రదేశాలలోనే దుకాణాలు ఏర్పాటు చేసుకుని టపాసుల విక్రయాలు చేయాలన్నారు. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. చిన్న పిల్లలను విక్రయాల పనుల్లో ఉంచుకోరాదన్నారు. లైసెన్స్ లు కల్గిన దుకాణదారులు మాత్రమే బాణసంచా విక్రయాలు చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా , అనుమతులు లేకుండా దీపావళి మందు గుండు సామాగ్రి కలిగి ఉన్నా, తయారుచేసినా లేదా అనధికార ప్రదేశాలలో నిల్వ ఉంచినా , విక్రయాలు జరిపినా అటువంటి వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. టపాసుల దుకాణాల వద్ద అగ్నిమాపక వాహనాన్ని, అంబులెన్స్ వాహనాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పని చేసి దీపావళి పండుగ సజావుగా నిర్వహించే విధంగా చూసుకోవాలన్నారు. దీపావళి పర్వదినం రోజున జిల్లా ప్రజలు ఆనందంగా జరుపుకోవాలన్నారు. టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఎక్కడైనా ప్రమాదం చోటు చేసుకున్నా, అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నా వెంటనే డయల్ - 100 లేదా డయల్ 112 కి గాని లేదా సంబంధిత పోలీసు స్టేషన్ కు గాని సమాచారం అందించాలని, సమాచారం చేరవేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.