Banni Utsavam: ప్రశాంత వాతావరణంలో సంతోషంగా బన్ని ఉత్సవాన్ని జరుపుకోవాలి..
Banni Utsavam: ప్రశాంత వాతావరణంలో సంతోషంగా బన్ని ఉత్సవాన్ని జరుపుకోవాలి..
ఈనెల 12న జరుగు బన్ని ఉత్సవాల సమీక్ష సమావేశంలో...
-జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య
కర్నూలు, అక్టోబర్ 5 (పీపుల్స్ మోటివేషన్):-
జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాల లో భాగంగా ఈనెల 12 వ తారీకున జరగనున్న బన్నీ ఉత్సవానికి ఏర్పాట్లు పై జరిగిన సమీక్ష సమావేశంలో కమిటీ సభ్యులను , గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ , ప్రశాంతంగా , సంతోషంగా ఉత్సవాలు జరగాలని అందుకు కమిటీ సభ్యులు అన్ని గ్రామాలను సందర్శించి హింసాత్మక ఉత్సవాలను విడనాడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి .నవ్య పలు సూచనలు జారీ చేశారు.
శుక్రవారం సాయంకాలం దేవరగట్టు లో జరిగిన బన్ని ఉత్సవ సమీక్ష సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య జిల్లా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఇందులో భాగంగా రోడ్లు భవనాల శాఖ వారు కొండపైన గుడి దగ్గర బారి కేడింగ్ చేయాలని అలాగే బన్ని ఉత్సవం జరిగే ప్రదేశంలో బారి కేడింగ్ చేయాలని , ఫైర్ సర్వీస్ వారు ఫైర్ ఇంజన్లు మరియు పోర్టబుల్ ఫైర్ ఎక్విప్మెంట్ అందు బాటులో ఉంచుకోవాలని , పంచాయతీరాజ్ శాఖ వారు రోడ్లకు మరమ్మత్తులు , పొదలు తొలగించి సరిచేయు చర్యలు వెంటనే చేయాలని , ఆర్డబ్ల్యూఎస్ వారు త్రాగునీరు ఏర్పాట్లు, డాక్టర్ల కొరకు రెండు బయో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని , మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు నాలుగు అంబులెన్సులు , 20 బెడ్ల ఆసుపత్రిని తయారు చేసుకోవాలని , అందుకు అవసరమైన మందులు సమకూర్చుకోవాలని సూచించారు. బన్నీ జరుగు ప్రదేశంలో మరియు కొండపైన అవసరమైన లైటింగ్ ఏర్పాట్లు మరియు పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా పంచాయతి అధికారికి సూచించారు. కర్ణాటక మధ్యాన్ని అరికట్టాలని ముందు రోజు మద్యం దుకాణాలు మూసి వేయించాలని ఆదేశించారు. దేవరగట్టు ప్రాంతంలో 100 సీసీ కెమెరాలు , డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని వీటివల్ల హింసాత్మక చర్యలు తగ్గుతాయని తెలియజేశారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ శాంతియుత వాతావరణంలో పూర్తయి బన్ని ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతకు ముందు జరిగిన సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ బన్నీ ఉత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని,అవసరమైతే కఠిన చర్యలు చేపడతామని తెలియజేశారు. అన్ని గ్రామాల ప్రజలు పోలీసులకు సహకరించి బన్నీ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలాగా కృషి చేయాలని కోరారు.
ఈ సమావేశానికి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ , జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి , జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ నాగేశ్వరరావు , డి ఎం అండ్ హెచ్ ఓ భాస్కర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.