Artificial Rains: కృత్రిమ వర్షం అంటే ఏమిటి..? డిల్లీలో కృత్రిమ వర్షాలు ఎందుకు?
Artificial Rains: కృత్రిమ వర్షం అంటే ఏమిటి..? డిల్లీలో కృత్రిమ వర్షాలు ఎందుకు?
కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉన్న నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు రాజధాని ప్రాంతంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి తెలిపారు. నవంబర్ వచ్చిందంటే చాలు ఢిల్లీ వాసులకు దడే. రాజధాని ప్రాంతంలో ఏటా అక్టోబర్ చివరి నుంచే గాలి కాలుష్యం (air pollution) గరిష్ఠ స్థాయికి చేరుతుంటుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రైతులు పంటల వ్యర్థాలు తగలబెట్టడానికి తోడు, చలికాలం కావడంతో దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. దీన్ని కట్టడి చేసేందుకు ఆప్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంటుంది.
ఈసారి కూడా వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే నగరంలో కృత్రిమ వర్షం (Artificial Rain) కురిపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర పర్యావరణ మంత్రికి లేఖ రాసినట్లు చెప్పారు. చలికాలంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోడానికి 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను మంత్రి విడుదల చేశారు.
2016 – 2023 మధ్య రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం 34.6 శాతం తగ్గిందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో నగరంలో రెండు కోట్ల చెట్లను నాటామని, దీని ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించగలిగామని వివరించారు. డ్రోన్ల ద్వారా కాలుష్య హాట్‌స్పాట్ ప్రాంతాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తామని మంత్రి తెలిపారు.
కృత్రిమ వర్షం అంటే ఏమిటి..?
కృత్రిమ వర్షాన్ని క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. ఈ విధానంతో వెదర్‌లో మార్పును తీసుకువస్తారు. గాలిలో నీటి బిందువులు ఏర్పడేలా ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. సిల్వర్ ఐయోడైడ్, పొటాషియం ఐయోడైడ్ లాంటి పదార్ధాలను గాలిలోకి వదులుతారు. దీని కోసం విమానాన్ని కానీ హెలికాప్టర్‌ను కానీ వాడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ సక్సెస్ కావాలంటే, ఆ పరీక్ష సమయంలో వాతావరణంలో తేమ చాలా అవసరం అవుతుంది. గాలి కూడా అనుకూలంగా ఉంటేనే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ వర్షం వల్ల గాలిలో ఉన్న దుమ్ము, ధూళి సెటిల్ అవుతుంది. నీటితో ఆ డస్ట్ కొట్టుకుపోయి.. పర్యావరణం క్లీన్ అవుతుంది.