పల్లె పండుగ కార్యక్రమం ద్వారా జిల్లాలో రూ. 82 కోట్లతో 1562 పనులకు శ్రీకారం
పల్లె పండుగ కార్యక్రమం ద్వారా జిల్లాలో రూ. 82 కోట్లతో 1562 పనులకు శ్రీకారం
కర్నూలు మండలం గొందిపర్ల గ్రామంలో రూ.41.62 లక్షలతో ఫార్మ్ పాండ్స్, సిసి రోడ్లు, గోకులాలు, ఫీల్డ్ చానల్స్ తదితర అభివృద్ధి పనులకు భూమి పూజ చేశాం
-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, అక్టోబర్ 14 (పీపుల్స్ మోటివేషన్):- "పల్లె పండుగ" కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా రూ.82 కోట్లతో 1562 పనులకు శ్రీకారం చుట్టామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు..
సోమవారం కోడుమూరు నియోజకవర్గం లోని కర్నూలు మండలం గొందిపర్ల గ్రామంలో "పల్లె పండుగ వారోత్సవాల్లో" భాగంగా ఇందిరమ్మ కాలనీలో మంజూరైన రోడ్లు, డ్రెయిన్లు తదితర అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, కోడుమూరు ఎంఎల్ఏ బొగ్గుల దస్తగిరి భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రూ.4500 కోట్లతో 30 వేలకు పైగా పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో రూ. 82 కోట్లతో 1562 అభివృద్ధి పనులను చేపట్టనున్నామని కలెక్టర్ తెలిపారు. కాగా కోడుమూరు నియోజకవర్గంలో రూ. 12.65 కోట్లతో, కర్నూలు మండలంలో రూ. 4.28కోట్లు, గొందిపర్ల గ్రామంలో రూ.41.62 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని కలెక్టర్ తెలిపారు.. గొందిపర్ల గ్రామంలో రూ.14లక్షలతో 8 ఫామ్ పాండ్స్, రూ.6.15 లక్షలతో ఫీల్డ్ చానల్స్, రూ.12 లక్షలతో సిసి రోడ్స్, రూ. 4.6 లక్షలతో గోకులాలు, ఇతర పనులకు రూ.4 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొదటి దశలో ఈ పనులను మంజూరు చేయడం జరిగిందన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద మళ్లీ ఏప్రిల్ నెలలో కూడా కొత్తగా పనులు చేపట్టే అవకాశం ఉందని, ఈ విధంగా నిరంతరంగా అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. గ్రామ సభలు నిర్వహించుకొని ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు.. గ్రామాలకు రోడ్లు అవసరం కాబట్టి మొదటి దశ లో ముందుగా రోడ్ల నిర్మాణంతో పాటు గోకులాలను కూడా పూర్తి చేయడం జరుగుతుందని, రెండవ దశలో డ్రెయిన్స్ పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు... రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, ప్రజల సహకారంతో పనులు పూర్తి చేయడం జరుగుతుందని, గ్రామాభివృద్ధికి ఇంకా అవసరమైన పనులు ఏమైనా ఉంటే ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకువస్తే వాటిని కూడా చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ గ్రామస్థులకు సూచించారు..
కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ "పల్లె పండుగ" కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పల్లెలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్రమంతటా అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం రాష్ర్ట వ్యాప్తంగా 4 వేల 500 కోట్ల రూపాయలతో 30 వేల పనులను చేపడుతోందని తెలిపారు..అలాగే 3 వేల కిలోమీటర్ల సిసి రోడ్లు, 500 కిలోమీటర్ల బిటి రోడ్లను, 25 వేల గోకులాలను, 10 వేల ఎకరాల నీటి సంరక్షణ కందకాలను అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనుందని ఎంఎల్ఏ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మన రాష్ట్రం అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉందని, ఇప్పటికీ కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతే భావితరాల భవిష్యత్తు నాశనం అయిపోతుందని, అందుకే ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం ద్వారా పల్లెలను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కొకటిగా పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతోందని, దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ పథకం కూడా ముఖ్యమంత్రివర్యులు అందజేయనున్నారన్నారు.. కూటమి ప్రభుత్వం రావడం వల్ల తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు..
కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, పంచాయితీ రాజ్ ఎస్ఈ రామచంద్రారెడ్డి, డిపిఓ భాస్కర్, సర్పంచ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు..