అతిసారంతో 8 మంది మృతి సీనియర్ ఐఎఎస్ అధికారితో విచారణ
అతిసారంతో 8 మంది మృతి సీనియర్ ఐఎఎస్ అధికారితో విచారణ
- గుర్ల గ్రామంలో విజృంభించిన డయేరియా
- వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న ప్రజలు
-ఒక్కరోజులోనే నలుగురి మృతి
- ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి:-విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గొర్లలో అతిసారంతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు.
ప్రస్తుతం గ్రామంలో ఉన్న పరిస్థితిని, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. డయేరియా వల్లనే మరణాలు అనే అంశంపై వైద్య శాఖ అధికారులతో మాట్లాడారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, సురక్షిత తాగునీరు అందజేస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
అయితే అసలు ఘటనకు కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. దీనిలో భాగంగా సీనియర్ ఐఎఎస్ అధికారి కె. విజయానంద్ తో మొత్తం ఘటనపై విచారణ జరిపించాలని సిఎం నిర్ణయించారు.
మరణాలకు అసలు కారణం ఏంటి, ఆయా ప్రభుత్వ శాఖల పరంగా ఉన్న సమస్యలు ఏంటి అనేది తెలుసుకునేందుకు సమగ్ర విచారణ జరపాలని సిఎం భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో నీటిని ఎప్పటికప్పుడు పరీక్షలకు పంపాలని....సమస్య పరిష్కారం అయ్యేవరకు తాగునీరు సరఫరా చేయాలని సిఎం ఆదేశించారు. వైద్య శిబిరాలు కొనసాగించాలని సిఎం సూచించారు.
వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, ఆర్ డబ్లుఎస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సిఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు ధైర్యం చెప్పి.....సమస్య పరిష్కారం అయ్యేవరకు వారికి అండగా ఉండాలని సిఎం అధికారులను సూచించారు.