5,500 డ్రోన్లతో కృష్ణమ్మ నడిబొడ్డున డ్రోన్ షో అద్భుత ప్రదర్శన
5,500 డ్రోన్లతో కృష్ణమ్మ నడిబొడ్డున డ్రోన్ షో అద్భుత ప్రదర్శన
వినీలాకాశంలో అద్భుత కనువిందు చేసిన డ్రోన్ షో
ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పిన ప్రదర్శన
ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
కార్యక్రమాన్ని ఆధ్యాంతం ఆస్వాదించిన సందర్శకులు
ప్రదర్శనను తిలకించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెం నాయుడు, బిసి జనార్దన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాసరావు
మంగళవారం రాత్రి విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద 5,500 డ్రోన్లతో ప్రదర్శించిన డ్రోన్ షో వినీలాకాశంలో అద్భుత కనువిందు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రదర్శనను తిలకించారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెం నాయుడు, రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, సూక్ష్మ, చిన్న మధ్య తరహా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్యమంత్రితో కలిసి ప్రదర్శనను తిలకించారు.
భారతదేశ మొదటి వైమానిక తపాలా, విమానయానం, గౌతమ బుద్ధుడు, భూగోళం మీద భారతదేశం, వివిధ రంగాలలో డ్రోన్ల వినియోగం, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ లోగో, త్రివర్ణ పతాకం ఈ డ్రోన్ల ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదర్శనతో సందర్శకులు సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు. డ్రోన్ షో ను ఆధ్యాంతం ఆస్వాదించి ప్రదర్శనను తమ సెల్ ఫోన్లలో బంధించారు.
కృష్ణమ్మ నడిబొడ్డున ప్రదర్శించిన ఈ డ్రోన్ షో 5 ప్రపంచ రికార్డులను నెలకొల్పినట్లు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డులు అందించారు.
ఈ ప్రదర్శనకు ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శాస్త్రీయ నృత్యం, ఆక్రోబయోటిక్ ప్రదర్శన, కియోరి బృందం బ్యాండ్ ప్రదర్శన అమితంగా ఆకట్టుకున్నాయి.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన వరాహ రూపం.., బొమ్మ బొమ్మ తై తై.., అయిగిరి నందిని మహిషాసుర మర్దిని.., శంభో శివ శివ శంభో.. వంటి భక్తి గీతాలు, ఘల్లు ఘల్లు జోడెద్దుల పరుగు చూడు తందనాన తానా వంటి జానపద నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..
ప్రపంచంలోనే మన దేశాన్ని డ్రోన్ హబ్ గా తయారు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనకు తొలి అడుగుగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి ఆ దిశగా అడుగులు వేయడం శుభ పరిణామం అన్నారు. దేశంలోనే మన రాష్ట్రాన్ని డ్రోన్ కేంద్రంగా తయారు చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. డ్రోన్ ఒక యంత్రం కాదని యంత్ర శక్తిని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకొని వ్యవసాయం పరంగా రైతులకు, శాంతిభద్రతల పరంగా పోలీస్ వ్యవస్థకు పాలనకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి ఆలోచన చేశారన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి కార్యక్రమం నిర్వహించలేదని దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో ఇటువంటి సమ్మిట్ నిర్వహించుకోవడం గర్వంగా ఉందన్నారు. ఐటి హబ్ గా మన రాష్ట్రం నుండి యువత ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతి పొందుతున్నారన్నారు. అమరావతిలో 300 ఎకరాలు డ్రోన్ సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, ఆ కేంద్రంలో డ్రోన్ సర్టిఫికేషన్ ఫెసిలిటేషన్ ఏర్పాటుకు మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సహకరిస్తుందన్నారు. అలాగే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ సెంటర్ తదితర హబ్స్ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. అతి పెద్ద డ్రోన్ షో నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందడం గర్వంగా ఉందని కేంద్రమంత్రి కే రామ్మోహన్ నాయుడు అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఎండి కే దినేష్ కుమార్, ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ నిధి మీనా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్చంద్ర తదితరులు పాల్గొన్నారు.