ఇసుక సరఫరా పెంచేందుకు అందుబాటులోకి 108 కొత్త రీచ్లు
Sand: ఇసుక సరఫరా పెంచేందుకు అందుబాటులోకి 108 కొత్త రీచ్లు
16వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
రాష్ట్రంలో డిమాండ్ కు తగ్గ స్థాయిలో ఇసుక సరఫరా ఉండేలా చూడాలని....ఈ విషయంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించి వినియోగదారులు ఇబ్బందులు పడకుండా చూడాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
మైనింగ్ శాఖపై సిఎం సచివాలయంలో సమీక్ష చేశారు. అక్టోబర్ 16వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇసుక సరఫరా కోసం మొత్తం 70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 108 కొత్త ఇసుక రీచ్‌లు అందుబాటులో వస్తాయని సమీక్షలో అధికారులు వివరించారు.
ఈ రీచ్ ల ద్వారా రోజూ 80,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 30,000 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా జరుగుతోందని...కొత్తగా అందుబాటులోకి వచ్చే రీచ్ లతో అదనంగా 80 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందని అధికారులు వివరించారు. ఇసుక బుకింగ్ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఆన్ లైన్ పోర్టల్ తో పాటు రీచ్‌ల వద్ద నేరుగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
తద్వారా ఆన్‌లైన్ పోర్టల్ నుండి బుక్ చేసుకోలేని వారు నేరుగా ఇసుక రీచ్‌కు వెళ్లవచ్చునని ముఖ్యమంత్రి తెలిపారు.
ఇసుక రీచ్‌లను డిస్టిక్ లెవల్ శాండ్ కమిటీ ఎంపిక చేసిన ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహిస్తాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఏజెన్సీలను డిస్టిక్ లెవర్ శాండ్ కమిటీ టెండర్ల ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తుందని అధికారులు తెలిపారు. ర్యాంప్ ల ఏర్పాటు, రీచ్ ల నిర్వహణ వ్యవహారాలు వీరు చూస్తారని అధికారులు వివరించారు.
ఇసుక రీచ్‌లోని ఇసుక స్టాక్ పాయింట్‌ను 24 గంటలు ఆపరేట్ చేయడానికి వారిని అనుమతిస్తామని, తద్వారా నిరంతర సరఫరాను కొనసాగించవచ్చు అని అధికారులు తెలిపారు. అయితే రీచ్ పాయింట్ వద్ద ఇసుక సరఫరా రేటు డీఎల్‌ఎస్‌సీ నిర్ణయించినట్లుగా ఉండాలని సిఎం సూచించారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను త్వరితగతిన అనుమతించడం ద్వారా మార్కెట్‌లో ఇసుక లభ్యత పెంచబోతున్నట్లు అధికారులు వివరించారు.
అయితే ఎక్కడా అక్రమాలకు తావులేకుండా చూడాల్సిన అవసరం ఉందని...దీని నిరంతర నిఘాతో పాటు నిత్యం పర్యవేక్షణ చేయాలని అధికారుల సిఎం ఆదేశించారు. ఇసుక లభ్యత, రవాణా ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు మొదలైన వాటి గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ సమాచారాన్ని పంపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. చెకింగ్, GPS ట్రాకింగ్, ఆడిట్ ల ద్వారా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చూడాలని సిఎం ఆదేశించారు.
డెలివరీలను వేగవంతం చేయడానికి మరిన్ని వాహనాలను అందుబాటులోకి తెచ్చుకోవాలని సిఎం సూచించారు. ఇసుక నిత్యావసరంగా భావించి సరఫరాకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని సిఎం సూచించారు. ఇసుక రవాణా ధరలు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సిఎం ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఇసుక రీచ్‌ల సంఖ్యను పెంచేందుకు ప్రైవేట్ వ్యక్తులు కూడా మైనింగ్ డిపార్ట్‌మెంట్ నుండి అనుమతితో తవ్వకాలు ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
అయితే ప్రైవేట్ వ్యక్తుల కోసం అనుమతించబడిన ఈ కొత్త ప్రైవేట్ ఇసుక రీచ్‌లలో కూడా డీఎల్‌ఎస్‌సీ నిర్ణయించిన ధరకే ఇసుకను సరఫరా చేయాల్సి ఉంటుందని సిఎం స్పష్టం చేశారు. ఇసుక విషయంలో ప్రజల నుంచి పూర్తి స్దాయిలో సానుకూల స్పందన వచ్చేలా అధికారుల చర్యలు ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.