Super Computers: హై-పెర్ఫామెన్స్ ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ప్రారంభించిన ప్రధాని మోదీ... వాటి వివరాలు ఇవే..!
Super Computers: హై-పెర్ఫామెన్స్ ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ప్రారంభించిన ప్రధాని మోదీ... వాటి వివరాలు ఇవే..!
శాస్త్రీయ పరిశోధనల కోసం రూ.130 కోట్లతో పుణె, ఢిల్లీ, కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ‘పరమ్ రుద్ర’ మూడు సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో వర్చువల్‌గా ప్రారంభించారు. వాతావరణ రీసెర్చ్ కోసం రూ.850 కోట్లతో రూపొందించిన హై-పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్‌ను కూడా మోదీ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ రోజును శాస్త్ర, సాంకేతిక రంగంలో చాలా గొప్ప విజయాలు సాధించిన రోజుగా పేర్కొన్నారు. మూడు సూపర్ కంప్యూటర్ల విలువ సుమారు రూ.130 కోట్లు
శాస్త్రీయ పరిశోధనలను సులభతరం చేయనున్న అత్యాధునిక కంప్యూటర్లు
సూపర్ కంప్యూటింగ్ టెక్నాలజీ రంగంలో స్వావలంబన లక్ష్యంలో కీలక ముందడుగు వేశామన్నారు.
పుణె, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో శాస్త్రీయ పరిశోధనలను సులభతరం చేసేందుకు ఈ సూపర్ కంప్యూటర్లను ఉపయోగించనున్నారు.
గురువారం ప్రారంభించిన మూడు సూపర్‌కంప్యూటర్లు ఫిజిక్స్ నుంచి ఎర్త్ సైన్స్, కాస్మోలజీ వరకు అధునాతన పరిశోధనలు చేయడానికి దోహదపడతాయని ప్రధాని చెప్పారు. నేటి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచం కీలకమైన ఈ రంగాలనే భవిష్యత్తు ప్రపంచంగా భావిస్తోందని అన్నారు. ఈ డిజిటల్ విప్లవాల యుగంలో కంప్యూటింగ్ సామర్థ్యం జాతీయ సామర్థ్యానికి పర్యాయపదంగా మారుతోందని వ్యాఖ్యానించారు. సాంకేతికత, కంప్యూటింగ్ సామర్థ్యంపై ప్రత్యక్షంగా ఆధారపడని రంగమంటూ ఏదీ లేదని, ఇది భారతదేశ విజయానికి అతిపెద్ద ఆధారమని మోదీ వ్యాఖ్యానించారు. ఇక వాతావరణం, సంబంధిత పరిశోధనల కోసం రూపొందించిన హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పీసీ) సిస్టమ్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ రూ. 850 కోట్లుగా ఉంది.
పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లను సరికొత్త హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సాంకేతికతలతో తయారు చేశారు. వీటిల్లో అత్యధిక విడిభాగాలను భారతదేశంలోనే తయారు చేశారు. మన దేశంలోనే అమర్చారు. ఇక సూపర్ కంప్యూటర్ల విషయానికి వస్తే పుణేలో జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ (జీఎంఆర్టీ), ఢిల్లీలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ (ఐయూఏసీ), కోల్‌కతాలో ఎస్‌ఎన్ బోస్ సెంటర్ సూపర్ కంప్యూటర్లను శాస్త్రవేత్తలు ఉపయోగించనున్నారు.
పరమ రుద్ర సూపర్ కంప్యూటర్స్ ప్రత్యేకతలు ఇవే..
• పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు అత్యంత సంక్లిష్ట గణనలను ఎంతో వేగంతో నిర్వహించగలవు.
• వాతావరణ సూచన, క్లైమేట్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ, మెటీరియల్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో పరిశోధన కోసం వీటిని ఉపయోగిస్తారు.
• పరిశోధకులకు సవాలుగా మారుతున్న సమస్యలను పరిష్కరించడానికి, ముఖ్యమైన ఆవిష్కరణలు చేయడానికి అవసరమైన గణన సాధనాలను ఈ సూపర్ కంప్యూటర్లు అందిస్తాయి.
• జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ (జీఎంఆర్‌టీ), సూపర్ కంప్యూటర్ ఫాస్ట్ రేడియో బరస్ట్స్ (ఎఫ్ఆర్బీ), ఇతర ఖగోళ దృగ్విషయాలను శోధించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
• ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ సూపర్ కంప్యూటర్ అందుబాటులోకి రావడంతో మెటీరియల్ సైన్స్, అటమిక్ ఫిజిక్స్ వంటి రంగాలలో పరిశోధనలు మెరుగుతాయి.
• ఎస్ఎన్ బోస్ సెంటర్ సూపర్ కంప్యూటర్‌తో ఫిజిక్స్, కాస్మోలజీ, ఎర్త్ సైన్స్ వంటి రంగాలలో అధునాతన పరిశోధనలను నిర్వహించవచ్చు.