Ganesh Chaturthi: మనదేశంలో గణేష్ ఉత్సవాలు ఎప్పుడు, ఎక్కడ మొదలయ్యాయి? ఈ సంస్కృతి ఎప్పుడు వచ్చింది?
Ganesh Chaturthi: మనదేశంలో గణేష్ ఉత్సవాలు ఎప్పుడు, ఎక్కడ మొదలయ్యాయి? ఈ సంస్కృతి ఎప్పుడు వచ్చింది?
• గణనాయకుడి పండుగ వచ్చేసింది
• స్వాతంత్ర్యోద్యమంలో సామాజిక వేదికలుగా
• వీధి వీధినా కొలువుతీరనున్న బొజ్జ వినాయకుడు
• హడావుడి చేస్తున్న యువకులు
హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-
వినాయకుడి పండుగ వచ్చేసింది. వీధి వీధినా బొజ్జ వినాయకులు కొలువు తీరాయి. మండపాల ఏర్పాట్లు, విగ్రహాల కొనుగోళ్లు చేస్తూ యువకుల హడావుడి చేస్తున్నారు.
భారత్ లో గణేష్ ఉత్సవాలు ఎప్పుడు, ఎక్కడ మొదలు...
దేశ స్వాతంత్ర్యం కాంక్షను రగిలించడం కోసం, యువతను ఏకం చేసేందుకు 1893లో మహారాష్ట్ర పుణె కేంద్రంగా సర్వజనైఖ్య గణేశ్ ఉత్సవాలకు నాయకులు పిలుపునిచ్చారు. గణపతి ఉత్సవాలను సామాజిక వేదికలుగా చేసి కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ వేడుకల్లో కుల మతాలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాల్గొన్నారు. లోకమాన్య బాలగంగాధర తిలక్ గణేశోత్సవానికి జాతీయ గుర్తింపు ఇవ్వడంలో కీలకపాత్ర పోషించారు. నాటి నుంచి వినాయక నవరాత్రులు మహారాష్ట్రను దాటి భారతదేశమంతటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
1893వ సంవత్సరానికి ముందు గణేష్ ఉత్సవాలను ప్రైవేట్ గా లేదా చిన్న స్థాయిలో నిర్వహించుకునేవారు. బ్రిటీష్ బానిసత్వం, మొఘల్ లతో సహా ఇతర విదేశీ ఆక్రమణదారుల అణచివేత మొదలైనవి దీని వెనుకగల కారణాలని చెబుతుంటారు. హిందువులు నాటిరోజుల్లో తమ ఇళ్లలోనే గణపతిని పూజించేవారు. స్వాతంత్య్ర పోరాట విప్లవ నాయకుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ దేశప్రజల ఐక్యతను, సామూహిక స్ఫూర్తిని పెంపొందించేందుకు గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముందడుగు వేశారు. నిమజ్జనం సందర్భంగా గణపతి పందాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలను బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి తిలక్ శాంతియుత ఆయుధంగా మలచుకున్నారు.
1895 నుంచి భాగ్యనగరంలో....
బాలగంగాధర్ తిలక్ పిలుపుతో హైదరాబాద్లో కూడా వినాయకుడి వేడుకలు మొదలయ్యాయి. హైదరాబాద్ సిటీ పాతబస్తీ శాలిబండ దగ్గరున్న భారత గుణవర్థక్ సంస్థను 1895లో ఉగాది రోజున స్థాపించారు. హైదరాబాద్లో నివసిస్తున్న మహారాష్ట్రీయులు బాలచంద్ర దీక్షిత, వక్రతుండ దీక్షిత, నారాయణరావు పిలాఖానె, లక్ష్మణరావు సదావర్తె, దాదాచారి కాలెమిత్ర బృందం సారథ్యంలో మరాఠా సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ.. తిలక్ స్పూర్తితో గుణవర్థక్ సంస్థ ప్రాంగణంలో వీధుల్లో వినాయకచవితి వేడుకలను ప్రారంభించింది.