CURRENT AFFAIRS: 20 సెప్టెంబర్ 2024
CURRENT AFFAIRS: 20 సెప్టెంబర్ 2024 కరెంట్ అఫైర్స్ వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అంకితభావం కలిగిన విద్యార్థులు మరియు పాఠకులందరికీ పీపుల్స్ మోటివేషన్ డైలీ కరెంట్ అఫైర్స్ ని అందజేస్తుంది..✍️
20 సెప్టెంబర్ 2024 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్
1). పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ తప్పుకోవాలన్న తీర్మానానికి మద్దతు పలకని భారత్
పాలస్తీనాలో ఆక్రమిత ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ వైదొలిగేందుకు 12 నెలల గడువును ఐక్మరాజ్యసమితి విధించింది. దీనికిగాను ప్రవేశ పెట్టిన తీర్మానంపై భద్రతామండలిలో ఉన్న 193 దేశాలకు గాను 124 దేశాలు మద్దతు ప్రకటించగా, భారత్ సహా 43 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. అంతర్జాతీయ న్యాయస్థానం సూచించిన విధంగా నిర్ణీత గడువులోపు చట్టపరమైన బాధ్యతల్ని పూర్తిచేయాలని డిమాండ్ చేసింది.
******
2). పీఎం-ఆశా పథకం
రైతులకు తక్కువ ధరలో ఎరువులను అందించడానికి రాయితీలు ఇచ్చేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, తృణధాన్యాల(పప్పులు, నూనెగింజలు) సాగును పెంచేందుకు, వినియోగదారులకు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులను అందించేందుకు ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షన్ అభియాన్ (PM-AASHA) పథకాన్ని కేంద్ర కేబినెట్ కొనసాగిస్తూ 2025-26 వరకు 15వ ఆర్థిక సంఘం నిర్ణయించిన మేరకు రూ.35వేల కోట్లు కేటాయించింది. ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలుపరిచేందుకు ప్రైస్ సపోర్టు స్కీమ్ (PSS), ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ (PSF) పథకాలను PM-AASHA పథకంలోకి విలీనం చేయబడ్డాయి.
మిడిల్ ఈస్ట్ దేశాలు, ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా నెలకొన్న ఘర్షణల కారణంగా మన దేశంలోని రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎరువులపై సబ్సిడీలను కేటాయిస్తూ కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, ఈ ఏడాది(2024 2025) రబీ సీజన్కు రాయితీపై రైతులకు పాస్పేట్, పొటాషియం ఎరువులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.24,474 కోట్లు కిటాయించింది. దీంతో సాగు వ్యయం తగ్గుతుంది, రైతులకు భరోసా లభిస్తుంది. రైతులకు కొరత లేకుండా నిరంతరాయంగా ఎరువులను అందుబాటులో ఉంటాయి.
పునరుద్ధరించబడిన పీఎం- ఆశా పథకం కింద భాగాలు:
• ధరల మద్దతు పథకం (పిఎస్ఎస్)
• ధరల స్థిరీకరణ నిధి (పిఎస్ఎఫ్)
• ధరల లోటు చెల్లింపు పథకం (పీడీపీఎస్)
• మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్)
ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ గురించి:
రైతులకు కనీస మద్దతు ధర (MSP) హామీన్నిచ్చేందుకు కేంద్రప్రభుత్వం "ప్రధానమంత్రి అన్నదాత అయ్ సంరక్షణ అభియాన్ (PM-AASHA) పథకాన్ని 2018లో ప్రారంభించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) మరియు నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED) సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తాయి.
ఈ పథకం లక్ష్యం:
రైతులకు వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను అందించడం. రైతులు పండించే పంటలకు పోషకాలు అందించడానికి సబ్సిడీపై ఎరువులు అందించడం.
******
3). బయో రైడ్ పథకానికి ఆమోదం తెలిపిన కేంద్రం
బయోటెక్నాలజీ రంగంలో అత్యాధునిక పరిశోధన, అభివృద్ధికి తోడ్పడేందుకు బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ (బయో-రైడ్) పథకం కొనసాగింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) ఆధ్వర్యంలో బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయో ఫౌండ్రీ అనే కొత్తగా ఏర్పాటు చేసిన పథకంతో 'బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ (బయో-రైడ్)' అనే పథకాన్ని విలీనం కానుంది. 2021-22 నుంచి 2025-26 కాలానికి గానూ ఏకీకృత పథకం 'బయో-రైడ్' అమలుకు కేంద్రప్రభుత్వం రూ.9,197 కోట్లు కేటాయించింది.
******
4). సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించాల్సిందేనా..
→ జనాభా పెరుగుదల, పర్యావరణ సమస్యలు(వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్), భారతదేశ ఉద్గార లక్ష్యాలను చేరుకోవడానికి క్లీన్ ఎనర్జీ అభివృద్ధిని వేగవంతం చేయడం, సరిహద్దుల్లో పెరుగుతున్న ఉగ్రవాద సమస్యలు వంటి కారణాల దృష్టా సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునఃపరిశీలించాల్సిన / సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత్ స్పష్టం చేసింది. కిషన్ గంగా, రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు గత ఆరేళ్లుగా పాకిస్థాన్ చర్చలకు నిరాకరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సింధు నదీ జలాల ఒప్పందం (Indus Water Treaty)లోని ఆర్టికల్ 12 అధికరణం 3 ప్రకారం, భారతదేశం ఆగస్టు 30న పాకిస్థాన్ కి నోటీసులు జారీ చేసింది. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని భారత్ పాకిస్థాన్ కు సూచించింది. అయితే, పాకిస్థాన్ ఒత్తిడి మేరకు గతంలో ప్రపంచ బ్యాంక్ తటస్థ నిపుణుడి అభ్యర్ధన, మధ్యవర్తిత్వ కోర్టు ప్రక్రియ రెండింటిని ప్రారంభించింది. ఒకే అంశంపై రెండు సమాంతర చర్యలుచేపట్టడం సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని భారత్ ఆరోపించింది.శ్రీ వివాద పరిష్కార యంత్రాంగాన్ని కూడా పునఃపరిశీలించాలని భారత్ కోరింది.
సింధు నదీ జలాల ఒప్పందం గురించి:-
ప్రపంచ బ్యాంకు సహాయంతో సింధు నదీ జలాల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్, పాకిస్థాన్ ల మధ్య 1960 సెప్టెంబరు 19న ఒక ఒప్పందం జరిగింది. దీనిపై భారత అప్పటి మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. దీనిని అంతర్జాతీయ ఒప్పందాలలో ఒకటిగా పరిగణిస్తారు. తొమ్మిదేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపకాలు జరిగాయి. సింధు నదీ జలాల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్ నదులు పాకు దక్కగా, రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్కు దక్కాయి. నదీజలాల వినియోగానికి సంబంధించి భారతదేశం, పాకిస్తాన్ల మధ్య సహకారం, సమాచార మార్పిడిని సులభతరం చేయడానికి ప్రతి దేశం నుండి ఒక కమిషనర్తో కూడిన శాశ్వత సింధు కమిషను ప్రపంచ బ్యాంకు ఈ ఒప్పందం ఏర్పాటు చేసింది. దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు. శాశ్వత సింధు కమిషన్ ఇరుదేశాల మధ్య నదీజలాల పరమైన సమస్యలను మరియు విభేదాలను తటస్థ నిపుణుడి ద్వారా పరిష్కరిస్తుంది.
మిగతా కరెంట్ అఫైర్స్ రేపటి పోస్ట్ లో...✍️
ధన్యవాదాలు🙏
ఎడిటర్
పీపుల్స్ మోటివేషన్ తెలుగు డైలీ పేపర్