CBN: తప్పు చేసిన వాళ్ల తాట తీస్తా : చంద్రబాబు వార్నింగ్
CBN: తప్పు చేసిన వాళ్ల తాట తీస్తా : చంద్రబాబు వార్నింగ్
> ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం...
> రచ్చబండకు హాజరైన సీఎం చంద్రబాబు...
> ప్రజలు చూపిన అభిమానం నా జీవితంలో మర్చిపోలేను...
> నాలుగుసారి సీఎం అయ్యా ఆర్భాటాలు చేస్తే ఏమొస్తుంది...
> ఊరికొక సైకో తయారయ్యాడని విమర్శలు...
> తప్పు చేసిన వాళ్ల తాట తీస్తా...
> ఈ సైకోలకు ప్రభుత్వం అంటే లెక్కలేనితనం అని ఆగ్రహం...
ప్రకాశం, (పీపుల్స్ మోటివేషన్):-
ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి శిష్యులు కొందరు తయారయ్యారని విమర్శించారు. ఊరికొక సైకో తయారయ్యారు.. ఆ సైకోలకు ప్రభుత్వం అంటే లెక్కలేని తనం వచ్చిందని మండిపడ్డారు.
ఎదురుదాడి చేస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు... ఎదురుదాడి చేస్తే నేను భయపడే రకం కాదు... తప్పు చేసిన వాళ్ల తాట తీస్తా అని ఘాటుగా హెచ్చరించారు.
ఇవాళ తాను ప్రజలను చూడ్డానికే మద్దిరాలపాడు వచ్చానని, హంగు ఆర్భాటాల కోసం కాదని అన్నారు.
"నేను 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను. అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఎన్ని ఆర్భాటాలు చేస్తే ఏమొస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా.
కానీ నేను కోరుకునేది ఒక్కటే... నేను చేసే ప్రతి పని వల్ల అనుక్షణం మీ జీవితాల్లో వెలుగు రావాలి, మార్పు రావాలి... అందుకోసమే నేను పాటుపడుతున్నా. ఇప్పుడు కూటమి పాలనకు 100 రోజులు పూర్తయింది. నా అనుభవాన్ని గుర్తించి, చరిత్రలో ఎన్నడూ లేనంతగా 93 శాతం స్థానాల్లో మమ్మల్ని గెలిపించారు.
శ్రీకాకుళం నుంచి జైత్రయాత్ర మొదలైంది. కానీ ప్రకాశం జిల్లాల్లో రెండు చోట్ల బ్రేక్ పడింది. దర్శి, యర్రగొండపాలెంలో ఓడిపోయాం. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియాలోనూ అరకు, పాడేరులో ఓటమిపాలయ్యాం. మిగతాచోట్ల అత్యధిక స్థానాల్లో మేం గెలిచామంటే అందుకు కారణం ప్రజలు చూపిన అభిమానమే. ఇది నా జీవితంలో మర్చిపోలేను.
భవిష్యత్తు బాగుండాలని మీరంతా ఓట్లేశారు. కానీ రాష్ట్రం పరిస్థితి చూస్తే వెంటిలేటర్ పై ఉంది. ఆక్సిజన్ తీసేస్తే ప్రాణం పోయే పరిస్థితి! అయితే, మీరందరూ ఒక మంచి పని చేశారు. కూటమి నుంచి 21 మంది ఎంపీలను గెలిపించారు. దాని వల్ల ఢిల్లీలో మన పరపతి పెరిగింది. కాబట్టి ఇవాళ రాష్ట్రానికి ఆక్సిజన్ తీసుకొస్తున్నా. కేంద్రం నుంచి మనకు సహకారం అందకపోతే నేను ఎన్ని మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఇదంతా సాధ్యమైంది మీ చొరవ వల్లే. ఆ చొరవే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టింది" అని చంద్రబాబు వివరించారు.
వికలాంగులు కానివాళ్లకు సర్టిఫికెట్లిస్తే మీ ఉద్యోగాలకే ప్రమాదం...
అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్టోబరు నెల మొత్తం అర్హులైన పెన్షన్ దారుల నమోదు కోసం కేటాయిస్తామని తెలిపారు.
దివ్యాంగులు... రూ.6 వేల పెన్షన్ కు అర్హులా? రూ.10 వేల పెన్షన్ కు అర్హులా? లేక వారు రూ.15 వేలు పెన్షన్ కు అర్హులా? అనేది పరిశీలించి, పెన్షన్లు ఇస్తామని వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్లకు చంద్రబాబు హెచ్చరికలు చేశారు.
"వికలాంగులు కానివాళ్లకు కూడా సర్టిఫికెట్లు ఇస్తే, మీ ఉద్యోగాలకే ప్రమాదం వస్తుందని హెచ్చరిస్తున్నా. నేను పేదల పట్ల ఎంత ఉదారంగా ఉంటానో, తప్పులు చేసిన వాళ్ల పట్ల అంత కఠినంగా ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను" అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.
ఇవాళ తాను ఇక్కడికి వచ్చింది ప్రజలతో నేరుగా మాట్లాడాలన్న ఉద్దేశంతో అని చంద్రబాబు స్పష్టం చేశారు. సమస్యలను అర్థం చేసుకుని, పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో వచ్చానని వివరించారు. మద్దిరాలపాడు గ్రామంలో మూడు ఇళ్లకు వెళ్లానని చంద్రబాబు తెలిపారు. తమ 100 రోజుల పాలన పట్ల వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని చెప్పారు.
భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు రూ.4 వేలు పెన్షన్ గా ఇస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్క ఇంటికీ లాభం కలగాలన్నది మా లక్ష్యం. పెన్షన్ ను రూ.4 వేలకు పెంచామని వివరించారు. ఎన్టీఆర్ రూ.35 తో పెన్షన్లకు శ్రీకారం చుట్టి, ఆ తర్వాత రూ.200 చేశారని... తాను ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్లలో రూ.2 వేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని వివరించారు.
"ఇప్పుడు దాన్ని రూ.4 వేలు చేశాం. అందుకోసం ఏడాదికి రూ.35 వేల కోట్లు ఖర్చవుతుంది. ఏప్రిల్ నుంచే పెన్షన్ ఇస్తానని చెప్పాను... ఇచ్చిన మాట ప్రకారం తొలి నెలలో రూ.7 వేలు ఇచ్చాం. ఇటీవల 1వ తేదీ సెలవు వస్తే, ఉద్యోగులు బాధపడకుండా ఒకరోజు ముందే జీతం ఇచ్చాం.
మా కూటమి ప్రజాప్రతినిధులు సహా, అధికారులందరూ పేదల ఇళ్లకు రావాలి, మీ కష్టాలు నేరుగా తెలుసుకోవాలి, మీ కష్టాలు చూసి మీతో అనుసంధానం కావాలని కోరుకున్నాం. మనం రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నాం... మన తర్వాత హర్యానాలో రూ.2,500 ఇస్తున్నారు. మనం ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తున్నాం" అని చంద్రబాబు వివరించారు.
ఆ ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసేది...
మాజీ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు ఏపీ సీఎం. ఏనాడైనా పది మందితో అతడు కలిసున్న ఫొటో ఎవరైనా చూశారా? జనాన్ని కలిసి సమస్యను విన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు.
"ఆ ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకు ఆశ్చర్యం వేసేది... రోడ్డు పక్కన పరదాలు కట్టేసేవారు. అతడు ఆకాశంలో వచ్చేవాడు... హెలికాప్టర్ లో వస్తుంటే కింద ఉన్న చెట్లన్నీ కొట్టేసేవారు. అంతేగాకుండా, ఒక కర్ఫ్యూ తరహా వాతావరణం కనిపించేంది. ఇష్టమున్నా, లేకపోయినా డ్వాక్రా సంఘాల వారిని బలవంతంగా తీసుకొచ్చేవారు. రాకపోతే పెన్షన్ కట్, రేషన్ కట్!
ఆయన సభకు వచ్చినవాళ్లు వెంటనే వెళ్లిపోకుండా చుట్టూరా కందకాలు తవ్వేసేవాళ్లు. ఇలాంటివన్నీ నేను టీవీలో చూసేవాడ్ని. అందుకే, ప్రజలందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలన్న సంకల్పంతో, చరిత్రలో ఎన్నడూ చూడనంత విజయాన్ని సాధించి పెట్టారు" అని వివరించారు.