సతి పదవి... పతి పెత్తనం
సతి పదవి... పతి పెత్తనం
• పదవి మాత్రమే ఆమెది.. పనులు చక్కబెట్టేది పెనిమిటే..
• స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ వరకూ ఇదే ఒరవడి.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళలకు రిజర్వేషన్‌లు కేటాయించినా.. రాజకీయంగా అవకాశం కల్పించినా.. కొందరు భర్తచాటు భార్యగానే ఉండి పోతున్నారు.
ప్రజాప్రతినిధులుగా కొందరు మహిళలు ఎంతో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. పదవులకు వన్నె తెచ్చారు. కానీ చాలా మంది మహిళా ప్రజాప్రతినిధులు తమ పెనిమిటి పెత్తనానికి తల ఊపు తున్నారు. సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. రాజకీయ అనుభవం లేని, చదువు రాని మహిళా ప్రతినిధులు పెనిమిటి చెప్పిన చోట సంతకం చేయడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నారు.పదవి మాత్రమే ఆమెది.. పనులు చక్కబెట్టేది పెనిమిటే.. స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ వరకూ దాదాపు ఎక్కడైనా ఇదే ఒరవడి. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై దేశమంతటా చర్చ సాగుతున్న నేపథ్యంలో మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయనుకుంటే
భర్తలు నీడలా వెంటాడుతున్నారు. వార్డ్ మెంబర్ నుండి ఎంపీ వరకు అధికారిక సమావేశాలు, సమీక్షలు అన్నింటికీ కుటుంబ సభ్యులు, భర్తలే ముందుంటున్నారు. భర్త చాటు భార్యగానే ఆమెకు స్థానం అధికారులే గుర్తుపట్టలేని పరిస్థితి. అధికారిక కార్యక్రమాలకు భర్తలకు అనుమతి లేదని ఆదేశాలు జారీ చేసినా అవి ఆచరణకు నోచుకోవడం లేదు.ఏ ప్రభుత్వ కార్యక్రమాలు జరిగిన భర్త కనుసన్నల్లోనే కార్యక్రమాలు సాగుతుండటం పట్ల పలువురు మహిళా నేతలు మండిపడుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మహిళలు ప్రచారం కోసం తిరుగుతారని గెలుపొందిన తర్వాత బయటికి రాని పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. మనదేశంలో కొన్ని వందల మంది మహిళలు ఉన్నత శిఖరాల్లో పదవుల ఆచరించి ఉన్నప్పటికీ గ్రామాల్లో మాత్రం ఆచరణకు నోచుకోలేని మహిళలుగానే ఉండిపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మహిళలకు దక్కే విధంగా ఆచరణ చేయాలని ఆశిద్దాం!!!