సైబర్ క్రైమ్ అలర్ట్..సైబర్ నేరగాళ్ల సరికొత్త ఎత్తుగడ "డిజిటల్ అరెస్ట్.." ప్రజలారా జాగ్రత్త !!!
సైబర్ క్రైమ్ అలర్ట్..సైబర్ నేరగాళ్ల సరికొత్త ఎత్తుగడ "డిజిటల్ అరెస్ట్.." ప్రజలారా జాగ్రత్త !!!
• మీకు తెలియకుండా మీరు ఏదైనా పార్సెల్ పంపించారని ఎవరైనా సంప్రదిస్తే స్పందించకండి..
• పార్సల్ లో డ్రగ్స్ ఉన్నాయని కేసు నమోదు చేశామని.. మేము పోలీసులు అంటూ ఎవరైనా కాల్ చేస్తే వారికి స్పందించకండి..
• పోలీసు అధికారులు ఎవరైనా సరే నేరుగా సంప్రదిస్తారు..
• వాట్సాప్ లేదా స్కైప్ వీడియో కాల్ ద్వారా సంప్రదించరు అని ప్రజలు గ్రహించాలి..
• ఇలాంటి సైబర్ నేరగాళ్ల కుయుక్తులకు గురి అయ్యి.. ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడకండి..
• ఏమైనా అనుమానాస్పద వీడియో కాల్స్/ ఈమెయిలు/ మెసేజ్ లు వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి..
-జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్
రోజురోజుకీ సైబర్ నేరగాళ్లు సరికొత్త ఆలోచనలతో ప్రజలను బురిడీ కొట్టించి, వారిని ఆర్థికంగా మానసికంగా దోచుకుంటున్నారు. అందులో భాగంగా సరికొత్త ఎత్తుగడ "డిజిటల్ అరెస్ట్" అనే విషయంపై జిల్లా ప్రజలు జాగ్రత్తలు వహించాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... ఇప్పుడు కొత్తగా సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ప్రజలకు కాల్ చేసి రకరకాలుగా భయభ్రాంతులకి గురిచేస్తున్నారు. సైబర్ నేరగాళ్ళు మొదటగా మన సమాచారాన్ని సోషల్ మీడియా/డేటా బేస్/వేరే ఏదైనా పద్దతుల నుండి పోగు చేసుకుంటారు.
"సైబర్ క్రైమ్ నేరగాళ్ళు మొదటగా మనకు కాల్ చేసి మీ మీద ఒక పార్సెల్ వేరే దేశంకు బుక్ అయింది. అందులో మాదక ద్రవ్యాలు వున్నాయని, అందుకు సంబంధించిన ఆధారాలు మా దగ్గర వున్నవి మరియు మీ మీద కేసు నమోదు చేయడం జరిగింది" అని చెప్పుతారు.
మనం నమ్మకపోతే వాళ్ళు వెంటనే మన దగ్గర ప్లే స్టోర్ నుంచి skype .. ఇంస్టాల్ చేయిస్తారు. సైబర్ నేరగాళ్ళు నేరుగా వీడియో కాల్ చేసి బ్యాక్ గ్రౌండ్ నిజమైన పోలీసుల వలే నమ్మేలా చేస్తారు. సైబర్ క్రైమ్ నేరగాళ్ళు మీ మీద అరెస్ట్ వారెంట్ వుంది అని మనకు నకిలీ పత్రాలు పంపుతారు.. అది నిజమే అని మనం నమ్మి మనం వాళ్ళు చెప్పిన విధంగా చేసేలా ప్రేరేపిస్తారు.
తరువాత వాళ్ళు కేసు నుండి తప్పించాలంటే, చెప్పిన విధంగా వారి బ్యాంకు ఖాతాకు నగదును పంపించాలని, ఈ విషయాన్ని ఎవరితోను చర్చించవద్దు అని చెప్తారు.
ఈ విధంగా సైబర్ నేరగాళ్లు ప్రజలను డిజిటల్ అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురిచేసి, వారిని ఆర్థికంగా దోచుకుని మానసిక క్షోభకు గురి చేస్తారు.
ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు:
1.Whats app నందు మీ యొక్క / మీ ఫ్యామిలీ ఫొటోస్ ను ప్రొఫైల్ ఫోటో గా పెట్టకపోవడం మంచిది.
2.మీ వ్యక్తిగత వివరాలను అనవసరంగా అపరిచిత వ్యక్తులకు ఇవ్వడం అంత మంచిది కాదు.
3.వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదు.
4.మీకు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా లలో పెట్టే ఫ్రెండ్ రిక్వెస్ట్ ని accept చేయకూడదు.
5.మీ యొక్క వ్యక్తి గత వివరాలను సోషల్ మీడియా నందు గోప్యంగా ఉంచాలి.
6.బహుమతులు గెలుచుకున్నారు అని వచ్చే ఈమెయిలు మరియు మెసేజ్ ల గురించి స్పందిచవద్దు.
7.మీరు కుటుంబ సభ్యులతో గాని లేక మీరు గాని ఎక్కడికయినా బయటకు వెళ్ళినప్పుడు మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని అనవసరంగా పొందుపరచకూడదు.
8.ఎవరి మీద అయినా పోలీస్ కేసు వుంటే సంబంధించిన పోలీస్ అధికారులు నేరుగా వస్తారు. అంతేగాని whats app లేదా skype video కాల్ అంటూ ఎవరూ చేయరు. అలా ఎవరైనా చేసినట్లయితే వెంటనే దగ్గర లో ఉన్న పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ ఆఫీసులో గాని సంప్రదించండి.
9.మన యొక్క వ్యక్తిగత భద్రతకు మనమే బాధ్యత వహించాలి.
10.అనవసరం గా సైబర్ క్రైమ్ నేరగాళ్లు చేసే కాల్ కు గురి అయ్యి డబ్బులను పోగొట్టుకోవద్దు.
జిల్లా ప్రజలు ఎవరైనా సైబర్ క్రైమ్ బారిన పడినట్లయితే అధైర్య పడకుండా వెంటనే గోల్డెన్ అవర్స్ 2 గంటలు మించకుండా లేక కనీసం 24 గంటలలోపు పోలీస్ గ్రౌండ్ నందు వున్నా సైబర్ క్రైమ్ ఆఫీస్ ను సంప్రదించినట్లయితే మీకు న్యాయం జరిగే అవకాశం ఎక్కువగా వుంటుంది. ఒకవేళ మీరు అందుబాటులో లేనట్లయితే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేయవచ్చును లేదా http://cybercrime.gov.in అనే పోర్టల్ నందు ఫిర్యాదు చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., జిల్లా ప్రజలను విజ్ఞప్తి చేశారు.