DSC: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
AP DSC: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీని ప్రకటించిన విషయం తెలిసిందే..
అభ్యర్థులకు మూడు నెలలపాటు శిక్షణ..
ఒక్కో అభ్యర్థిపై రూ.25 వేల వరకు ఖర్చు..
త్వరలో ప్రారంభించాలని నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 16,347 పోస్టుల భర్తీకి ఇప్పటికే మెగా డీఎస్సీని ప్రకటించిన నేపథ్యంలో గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణకు సంబంధించి గిరిజన సంక్షేమశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన సంక్షేమశాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా గిరిజన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఏజెన్సీ ప్రాంతాల నుంచి దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి...
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా ఇప్పటికే అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా 2,150 మంది నమోదు చేసుకున్నారు. గిరిజన ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎక్కువ దరఖాస్తులు రాగా... గిరిజనేతర ప్రాంతాల నుంచి తక్కువ సంఖ్యలో వచ్చాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని 6 ఐటీడీఏల్లోనూ ప్రతి చోటా ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. గిరిజనేతర ప్రాంతాలకు సంబంధించి దరఖాస్తుదారుల సంఖ్యకు అనుగుణంగా రెండు లేదా మూడు చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఒక్కో కేంద్రంలో 100 నుంచి 150 మందికి శిక్షణ ఇస్తారు. త్వరలో ఉచిత శిక్షణ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
తొలి విడతలో 1,000 మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు...
డిఎస్సీ అభ్యర్థులకు మూడు నెలలపాటు శిక్షణ ఇస్తారు. వసతి, భోజన ఖర్చునూ ప్రభుత్వమే భరించనుంది. మెటీరియల్ ను కూడా ఉచితంగా అందించనున్నారు. ఇందుకుగాను ఒక్కో అభ్యర్థిపై రూ.25 వేల వరకు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం 1,000 మందికి తొలి విడతలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్ కు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.