Monkeypox Virus: మంకీపాక్స్ అంటే ఏమిటి..? లక్షణాలు ఏంటి..? ఎందుకంత భయం..? వైరస్ వ్యాప్తి ఇలా..? వ్యాక్సిన్‌లు ఉన్నాయా..?
Monkeypox Virus: మంకీపాక్స్ అంటే ఏమిటి..? లక్షణాలు ఏంటి..? ఎందుకంత భయం..?
వైరస్ వ్యాప్తి ఇలా..? వ్యాక్సిన్‌లు ఉన్నాయా..?
Monkeypox Virus:-
ఎంపాక్స్ కలవరం.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో కరోనా విలయాన్ని చవిచూసిన ప్రపంచానికి మంకీపాక్స్ (ఎంపాక్స్) రూపంలో మరో ప్రమాదం పొంచి ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా జారీ చేసిన గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆదేశాలను బట్టి అర్థమవుతున్నది. ఆఫ్రికా దేశాల్లో సాధారణంగా కనిపించే ఈ వైరస్.. స్వీడన్‌కూ వ్యాపించింది.
• ఆఫ్రికా నుంచి వేగంగా ఇతర దేశాలకు వైరస్ వ్యాప్తి
• స్వీడన్‌లో కలకలం.. పాక్‌లో మూడు కేసులు నమోదు
కరోనా విలయాన్ని చవిచూసిన ప్రపంచానికి మంకీపాక్స్ (ఎంపాక్స్) రూపంలో మరో ప్రమాదం పొంచి ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా జారీ చేసిన గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆదేశాలను బట్టి అర్థమవుతున్నది. ఆఫ్రికా దేశాల్లో సాధారణంగా కనిపించే ఈ వైరస్.. స్వీడన్‌కూ వ్యాపించింది. తాజాగా పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో మూడు కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తున్నది.
ఏమిటీ ఎంపాక్స్ వైరస్?
మంకీపాక్స్ (ఎంపాక్స్) వ్యాధి మంకీపాక్స్ (ఆర్థోపాక్స్ వైరస్‌లో ఒక రకం) అనే వైరస్ ద్వారా వస్తుంది. డెన్మార్క్‌లో 1958లో తొలిసారిగా దీన్ని గుర్తించారు. 1970లో మొదటిసారిగా ఓ మనిషికి ఇది సోకింది. ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది. దీంతో ప్రపంచ దేశాలు ఈ వైరస్‌ను నిర్లక్ష్యం చేశాయి. అయితే, 2022లో 116 దేశాలకు వ్యాపించిన ఈ వైరస్ కారణంగా 99 వేల మంది వ్యాధిబారిన పడ్డారు. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి.
ఎందుకంత భయం?
మంకీపాక్స్ వైరస్ రెండు వేరియంట్లలో వ్యాప్తి చెందుతున్నది. క్లాడ్-1 (కాంగోబేసిన్ క్లాడ్) తొలి వేరియంట్ ప్రమాదకరమైనది. నిమోనియా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుంది. మరణాల రేటు 10 శాతం వరకూ ఉండొచ్చు. ఇక, క్లాడ్-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్) వేరియంట్ తొలి వేరియంట్‌తో పోలిస్తే, కొంత తీవ్రత తక్కువగా ఉంటుంది. ఈ వేరియంట్ సోకిన వారిలో శరీరంపై పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరణాల రేటు 1 శాతం కంటే తక్కువే. కాగా, ఇప్పుడు విజృంభిస్తున్న వైరస్.. క్లాడ్-1 వేరియంట్ రకానికి చెందినది కావడంతో డబ్ల్యూహెచ్‌వో సహా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా 2022లో ప్రబలంగా విస్తరించిన వైరస్ క్లాడ్-2 వేరియంట్ రకానిది కావడంతో మరణాల రేటు తక్కువగా నమోదైంది.
ఎంపాక్స్ లక్షణాలు ఏంటి?
వ్యాధిగ్రస్తుల చర్మంపై పొక్కులు, జ్వరం, గొంతు తడారిపోవడం, తల తిరగడం, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం సంభవించవచ్చు. సాధారణంగా మనిషి శరీరంలోకి వైరస్ ప్రవేశించిన 21 రోజుల లోపు ఎప్పుడైనా లక్షణాలు బయటపడొచ్చు. మరికొందరిలో రెండు వారాల నుంచి నెలలోపు బయటపడొచ్చు.
వైరస్ వ్యాప్తి ఇలా..
నేరుగా తాకడం, శృంగారం వల్ల మంకీపాక్స్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల కూడా సోకే ప్రమాదం ఉంది. రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువుల వినియోగం, పచ్చబొట్ల ద్వారా, వ్యాధి సోకిన జంతువులను తాకడం వల్ల కూడా వైరస్ వ్యాప్తి జరుగుతుంది.
ఏయే దేశాల్లో వైరస్ వ్యాప్తి
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకూ మొత్తం 14 వేల వరకూ మంకీపాక్స్ కేసులు నమోదైతే, 524 మంది మరణించారు. మొత్తం కేసుల్లో క్లాడ్-1 రకానికి చెందిన కేసులు 100కు పైగా ఉన్నాయి. తొలుత బురుండి, కెన్యా, రువాండా, ఉగాండా దేశాలకు పరిమితమైన ఈ వైరస్ కేసులు.. స్వీడన్, పాకిస్థాన్‌లోనూ నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు.
వ్యాక్సిన్‌లు ఉన్నాయా?
ప్రస్తుతం మంకీపాక్స్ నివారణకు రెండు ఎంపాక్స్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి సోకిన నాలుగు రోజుల్లోపు టీకా తీసుకొంటే మంచిదని వైద్య నిపుణులు చెప్తున్నారు. వ్యాధి సోకినప్పటికీ లక్షణాలు బయటపడని వారు 14 రోజుల్లోపు తీసుకోవాలని పేర్కొన్నారు. మంకీపాక్స్ గతంలో ఆఫ్రికా దేశాలకే పరిమితమవ్వడంతో ఈ టీకాలకు పలు దేశాలు అనుమతులు ఇవ్వలేదు. అయితే, పరిస్థితులు మారడంతో ఇప్పుడు అనుమతులనిచ్చే అవకాశం ఉన్నది.