Supreme Court: పుట్టుకతో ఎవరూ నేరస్థులు కాదు..పరిస్థితులే వారిని అలా మారుస్తాయని.. సుప్రీంకోర్టు వాఖ్య
Supreme Court: పుట్టుకతో ఎవరూ నేరస్థులు కాదు..పరిస్థితులే వారిని అలా మారుస్తాయని.. సుప్రీంకోర్టు వాఖ్య
- పరిస్థితులే వారిని అలా మారుస్తాయని కామెంట్...
- కొన్ని కేసులను మానవత్వంతో విచారించాలని సూచన....
- దొంగనోట్ల చలామణి కేసు నిందితుడికి బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య...
పరిస్థితుల ప్రభావం, ఇతరత్రా కారణాల వల్లే నేరస్థులుగా మారతారు తప్ప పుట్టుకతోనే ఎవరూ క్రిమినల్స్ కారని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఈమేరకు నకిలీ కరెన్సీ చలామణి కేసుకు సంబంధించి నాలుగేళ్లుగా జైలులో మగ్గుతున్న నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కామెంట్స్ చేసింది. కేసు విచారణ సమయంలో మానవత్వం చూపాల్సిన కేసులు ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పింది. నేరస్థుడికి శిక్షగా బెయిల్ తిరస్కరించకూడదనే విషయాన్ని హైకోర్టు, ట్రయల్ కోర్టులు మరిచిపోతున్నాయని కామెంట్ చేసింది.
ముంబైకి చెందిన ఓ వ్యక్తిని 2020 ఫిబ్రవరిలో పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ నుంచి దొంగనోట్లు తీసుకొచ్చి ముంబైలో మార్చేందుకు ప్రయత్నించాడని పోలీసులు ఆరోపించారు. అరెస్టు సమయంలో అతడి వద్ద భారీ మొత్తంలో దొంగనోట్లు దొరికాయని చెప్పారు. రూ.2 వేల నోట్లు మొత్తం 1193 ఉన్న బ్యాగు అతడి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలతో నిందితుడిని జైలుకు పంపారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా ఈ కేసు విచారణ జరగలేదు. బెయిల్ కోసం నిందితుడు చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి. బాంబే హైకోర్టు అతడి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. నాలుగేళ్లుగా నిందితుడు జైలులో మగ్గుతున్నాడని, దీనిని పరిగణనలోకి తీసుకుని నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.