MPDO: అదృశ్యమైన నర్సాపురం ఎంపీడీవో మృతి..! ఏలూరు కాల్వలో ఎంపీడీవో మృతదేహం..!
MPDO: అదృశ్యమైన నర్సాపురం ఎంపీడీవో మృతి..! ఏలూరు కాల్వలో ఎంపీడీవో మృతదేహం..!
15న నరసాపురం ఎంపీడీవో అదృశ్యం
ఏలూరు కాల్వలో ఎంపీడీవో మృతదేహం
అదృశ్యం వెనక మాధవాయిపాలెం పెర్రీ రేవు పాటదారు
అదృశ్యమైన ఎంపీడీవో వెంకటరమణ మృతి చెందారు. ఏలూరు కాల్వలో ఎంపీడీవో వెంకటరమణ మృతదేహంను పోలీసులు ఈరోజు ఉదయం గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎంపీడీవో మృతదేహాన్ని వెలికితీశాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహంను కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించనున్నారు. ఈ నెల 15న ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం అయిన విషయం తెలిసిందే. వెంకటరమణ రావు విజయవాడ సమీప కానూరు మహదేవపురం కాలనీలో నివాసం ఉంటున్నారు.
నా పుట్టిన తేదీనే.. నేను చనిపోయే రోజు...
నరసాపురంలో ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆయన సెలవు రోజుల్లో ఇంటికి వస్తుంటారు. జులై 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టి కానూరు వచ్చారు. ఈ నెల 15న మచిలీపట్నంలో పని ఉందంటూ ఇంట్లో చెప్పి వెళ్లారు. ఆరోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి.. తాను బందరులో ఉన్నానని, ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని చెప్పారు. ఆ తర్వాత వెంకటరమణ ఆచూకీ తెలియలేదు. ఫోన్ కూడా పని చేయలేదు. అర్ధరాత్రి దాటాక నా పుట్టిన రోజైన 16వ తేదీనే.. నేను చనిపోయే రోజు కూడా.. అందరూ జాగ్రత్త అని భార్య ఫోనుకు మెసేజ్ పంపారు.
వెంకటరమణ మెసేజ్ తో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వెంకటరమణ వాహనం మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. దాంతో విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఆయన మొబైల్ సిగ్నల్ ను ట్రాక్ చేయగా విజయవాడలోని మధురానగర్ ఏలూరు కాల్వ వద్ద కట్ అయినట్లు గుర్తించారు. ఏలూరు కాల్వలో వెంకటరమణ దూకినట్లు భావించారు. చివరకు ఆయన మృతదేహంను పోలీసులు కనుగొన్నారు. ఎంపీడీవో అదృశ్యం వెనక మాధవాయిపాలెం పెర్రీ రేవు పాటదారు రూ.లక్షల్లో బకాయిలు ఉండటమే కారణమని తెలుస్తోంది.