Iran Presidential Elections: ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్
Iran Presidential Elections: ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్
- ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్..
- అధ్యక్ష ఎన్నికల్లో సయీద్ జలీలీపై విజయం..
- ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో 49.8 శాతం ఓటింగ్ నమోదు..
అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలుపడ్డాయి. సంస్కరణవాద అభ్యర్థి మసూద్ పెజెష్కియాన్ అధ్యక్ష ఎన్నికల్లో అతివాద అభ్యర్థి సయీద్ జలీలీని ఓడించి విజయం సాధించారు. దేశంలో 49.8 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి మొహసిన్ ఎస్లామీ తెలిపారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు దాదాపు 30 మిలియన్ల ఓట్లు పోలయ్యాయి. శుక్రవారం ఎన్నికల తర్వాత అధికారులు సమర్పించిన డేటా పెజెష్కియాన్ను 16.3 మిలియన్ ఓట్లతో విజేతగా ప్రకటించగా, జలీలీకి 13.5 మిలియన్ల ఓట్లు వచ్చాయి. ఇరాన్ హార్ట్ సర్జన్, ఎంపీ మసూద్ పెజెష్కియాన్ ఎన్నికల ప్రచారంలో పశ్చిమ దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రజలు సయీద్ జలీలీ కంటే అతనికి అధికంగా ఓట్లేసి గెలిపించారు.
పెజేష్కియాన్ మద్దతుదారులు శనివారం ఉదయం వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు, ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఎన్నికల ప్రాముఖ్యత గురించి శుక్రవారం వెల్లడించారు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును వినియోగించుకోవాలి.. అధ్యక్షుడిని ఎన్నుకొని దేశ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో అధిక పోలింగ్కు ఆయన పిలుపునిచ్చారు. గాజా యుద్ధంపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ఇరాన్లో ఎన్నికలు జరిగాయి. ఇరాన్కు పశ్చిమ దేశాలతో వివాదం ఉన్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా అనేక రకాల ఆంక్షలు దాని ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు దేశాన్ని వృద్ధి దశలో నడిపించాల్సి ఉంటుంది. అన్ని దేశాలతో సత్సంబంధాల కోసం కృషి చేయాల్సి ఉంటుంది.
ఇరాన్ ఎన్నికల సంఘం నుంచి వచ్చిన డేటా ప్రకారం, ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించబడిన ఏకైక సంస్కరణవాద నాయకుడు పెజెష్కియాన్. పెజెష్కియాన్ అభ్యర్థిత్వం గురించి ఇటీవల వరకు పెద్దగా చర్చ జరగలేదు, అయితే మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖతామీ, ఉదారవాది హసన్ రౌహానీల మద్దతు అతని అభ్యర్థిత్వానికి బలాన్నిచ్చింది. ప్రచారం సందర్భంగా, 69 ఏళ్ల పెజెష్కియాన్, ముఖ్యంగా పశ్చిమ దేశాలతో నిర్మాణాత్మక సంబంధాలను, ప్రపంచంలో ఒంటరిగా ఉన్న ఇరాన్ అణు ఒప్పందాన్ని పునరుద్ధరించాలని ఉద్ఘాటించారు.
ఇరాన్లో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయాలనేది ఆ దేశ గార్డియన్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. నలుగురు అభ్యర్థుల పేర్లను గార్డియన్ కౌన్సిల్ ఆమోదించింది. తొలి దశలో ఏ అభ్యర్థి కూడా 50 శాతం ఓట్లను సాధించలేకపోయారు. దీని తరువాత, రన్-ఆఫ్ పోల్ నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో మొదటి ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ ఉంది. ఈ పోటీలో, సంస్కరణవాద నాయకుడు మసూద్ పెజెష్కియాన్, సంప్రదాయవాది సయీద్ జలీలీని ఓడించి ఇరాన్ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పెజెష్కియాన్ ఎంపీగానే కాకుండా మహ్మద్ ఖతామీ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేశారు. సయీద్ జలీలీ ఇరాన్ మాజీ చీఫ్ న్యూక్లియర్ నెగోషియేటర్.