Fraud: కేటుగాళ్లు ఎంపీడీవోకే టోకరా..!ఏసీబీ పేరు చెప్పి ఐదు లక్షల రూపాయలు వసూలు..!
Fraud: కేటుగాళ్లు ఎంపీడీవోకే టోకరా..! ఏసీబీ పేరు చెప్పి ఐదు లక్షల రూపాయలు వసూలు..!
• సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న బండి లక్ష్మప్ప
ఏసీబీ పేరు చెప్పి ఎంపీడీవోకు ఐదు లక్షల రూపాయలు టోకరా వేశారు కేటుగాళ్లు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న బండి లక్ష్మప్పను కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఏసీబీకి ఫిర్యాదు వచ్చిందని ఎంపీడీవోకు నిందితులు ఫోన్ చేశారు. ఏసీబీలో తనపై కేసు నమోదు అవుతుందని ఎంపీడీవోను ఆగంతుకులు బెదిరించారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా 5 లక్షల రూపాయలను ఎంపీడీవో ద్వారా కాజేశారు కేటుగాళ్లు. గత నెల 20వ తేదీన తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎంపీడీవో లక్ష్మప్ప ఫిర్యాదు చేయగా.. ఎంపీడీవో దగ్గర డబ్బులు కాజేసిన ముగ్గురిలో ఇద్దరు నిందితులను మహబూబ్‌నగర్ బస్టాండ్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. 50వేల రూపాయలతో పాటు రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. నిందితులు తరుణ్ గౌడ్, ముజాహిద్, నూతేటి జయకృష్ణలు అని పోలీసులు గుర్తించారు. జయ కృష్ణపై తెలుగు రాష్ట్రాలలో 31 కేసులతోపాటు.. శంషాబాద్, సిద్దిపేటలో ఏసీబీ అధికారులు అని చెప్పి మోసగించినవి మూడు కేసులు నమోదు కాగా.. నిందితుడు జయకృష్ణ పరారీలో ఉన్నాడు. ఎంపీడీవో బండి లక్ష్మప్ప స్వగ్రామం తాండూర్ పట్టణం కావడంతో ఫిర్యాదు తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో చేశారు.