Doctors Day: నేషనల్ డాక్టర్స్ డే.. జులై ఒకటినే ఎందుకంటే..!
Doctors Day: నేషనల్ డాక్టర్స్ డే.. జులై ఒకటినే ఎందుకంటే..!
1991 జులై 1 నుంచి డాక్టర్స్ డే నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం..
భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి జ్ఞాపకార్థం ఏర్పాటు..
లక్షలాది మంది డాక్టర్లు, ఆసుపత్రులు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రత్యేక రోజు నిర్వహణ..
దేశ ప్రజల కోసం లక్షలాది మంది డాక్టర్లు, ఆసుపత్రులు అందిస్తున్న నిరంతర సేవలకు గుర్తింపు, గౌరవ సూచకంగా కేంద్ర ప్రభుత్వం 1991 నుంచి ఏటా జులై 1న నేషనల్ డాక్టర్స్ డే నిర్వహిస్తోంది. పేదల వైద్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ ఫిజీషియన్, పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి జులై 1 కావడంతో ఆయన జ్ఞాపకార్థం ఈ రోజును నేషనల్ డాక్టర్స్ డేగా పాటిస్తోంది.
జాతిపిత మహాత్మా గాంధీకి స్నేహితుడైన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్.. ఆయనకు వ్యక్తిగత వైద్యుడిగానూ వ్యవహరించారు. కేంద్రం ఆయన్ను 1961లో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’తో సత్కరించింది. వైద్య వృత్తికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకోవడంతోపాటు వృత్తి నిబద్ధత, వైద్య రంగంలో మానవతా విలువల పెంపు కోసం నేషనల్ డాక్టర్స్ డేను కేంద్రం అమలు చేస్తోంది.
ఈ ఏడాది డాక్టర్స్ డే థీమ్ ‘హీలింగ్ హ్యాండ్స్.. కేరింగ్ హార్ట్స్’. వ్యాధులు లేదా అనారోగ్యంతో సతమతమయ్యే రోగులకు సాంత్వన చేకూర్చడంలో వైద్యులు పోషించే పాత్రను తెలియజెప్పడం ఈ థీమ్ ఉద్దేశం. అలాగే డాక్టర్లు తమ వృత్తికి జాలి, కరుణను ఎలా జోడిస్తారో వివరించడం కూడా ఈ రోజు ఉద్దేశాల్లో ఒకటి.
ఈ రోజు దేశమంతా వైద్యుల కోసం ఆసుపత్రుల్లో సెమినార్లు, అవార్డుల ప్రదానం లాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోషల్ మీడియా ద్వారా కూడా వైద్య వృత్తిపై ప్రజల్లో విస్తృత ప్రచారం, అవగాహన కల్పిస్తారు. నేటి యువత వైద్య రంగాన్ని ఒక వృత్తిగా ఎంపిక చేసుకొనేలా ప్రోత్సహించడానికి ఈ రోజు ఉపయోగపడనుంది. మౌలికవసతుల కొరత, పనిభారం, ఒత్తిళ్ల గురించి వైద్యులు ప్రభుత్వానికి తెలియజేసేందుకు డాక్టర్స్ డే అవకాశం కల్పిస్తుంది.