Conocarpus Tree: ఈ మొక్కలతో ఆరోగ్యానికి మహా డేంజర్..!
Conocarpus Tree: ఈ మొక్కలతో ఆరోగ్యానికి మహా డేంజర్..!
మాంగ్రూవ్ మొకలుగా పిలిచే వీటిని అవగాహన లేక రోడ్ల పక్కన, డివైడర్ల మధ్యలో విరివిగా నాటుతున్నారు. పచ్చదనం, అందం కోసం పెంచే ఈమొక్కల వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణంలోని అన్ని రకాల చెట్లు మనకు మేలు చేస్తాయని అనుకోకూడదని, హాని చేకూర్చే చెట్లూ కూడా ఉన్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అటువంటి ప్రమాదకరమైన మొక్కల్లో కోనోకార్పస్ (Conocarpus Tree) ఒకటి. కోనోకార్పస్ వృక్షాల పుప్పడి అత్యంత ప్రమాదకరమైనదని, కరోనా సోకిన వ్యక్తి శ్వాసకోశ సమస్యలతో ఎలా ఇబ్బంది పడతాడో ఈ చెట్ల నుంచి వచ్చే గాలిని పీల్చేవారు కూడా అంతటి ప్రమాదానికి గురయ్యే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ మొక్కలను సమూలంగా నిర్మూలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాకినాడలో ఇప్పటికే 5వేల వరకు మొక్కలను తొలగించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా అటవీశాఖ అధికారులపై ఒత్తిడి పెరుగుతున్నది. తెలంగాణలో దాదాపు 10 కోట్లకు పైగా కోనోకార్పస్ మొక్కలు ఉన్నట్టు అంచనా. ఏపీలో వాటిని నిర్మూలిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా వాటిని తొలగించాలని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఆ మొక్కలను కొత్తగా ఎక్కడా నాటడం లేదని చెప్పారు.