రుతుస్రావ సెలవుల పై మోడల్ పాలసీ ని రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశం
రుతుస్రావ సెలవుల పై మోడల్ పాలసీ ని రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశం
• నెలసరి వేళ ఇబ్బందిపడే ఉద్యోగినులకు రుతుస్రావ సెలవుల పై మోడల్ పాలసీని రూపొందించడానికి సంబంధిత వర్గాలు, రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపకల్పన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, విధాన నిర్ణేతల పరిధిలోని ఈ అంశాల్లో కోర్టులు జోక్యంచేసుకోబోవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం స్పష్టం చేసింది.
• దేశవ్యాప్తంగా విద్యార్థినులు, ఉద్యోగినులకు ప్రతినెలా నెలసరి సెలవులు ఇవ్వాలంటూ లాయర్ శైలేంద్రమణి త్రిపాఠి వేసిన పిటిషన్ ను కొట్టేస్తూ సుప్రీం కోర్టు "రుతుస్రావ సెలవుపై కోర్టు నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగినుల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని, అసౌకర్యంవేళ సెలవు దొరుకుతుందని భావిస్తే ఎక్కువ మంది ఉద్యోగాలు చేసేందుకు మొగ్గుచూపుతారని పేర్కొంది.
• అలాగే, ఉద్యోగినులకు ఇలాంటి సెలవు ఇవ్వడం ఇష్టంలేని సంస్థలు, యాజమాన్యాలు మహిళలకు ఉద్యోగం ఇచ్చేందుకు విముఖత చూపే ప్రమాదం కూడా ఉందని, ఇప్పటికే ఉన్న ఉద్యోగినులను కూడా తగ్గించుకునే ప్రమాదం ఉంటుందని, ఇలాంటి విపరిణామాలకు మేం అవకాశం ఇవ్వదల్చుకోలేదని, వాస్తవానికి ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని, ఇందులో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోదు అని" ధర్మాసనం స్పష్టం చేసింది.
• చైనా, బ్రిటన్, జపాన్, ఇండోనేసియా, స్పెయిన్, జాంబియా, దక్షిణకొరియాలో ఏదో ఒక కేటగిరీ కింద ఇలాంటి సెలవులు ఇస్తున్నాయంటూ లాయర్ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. “ఈ సెలవులు ఇవ్వాలని గత ఏడాది మే నెలలోనే పిటిషనర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం నుంచి ఇంతవరకు స్పందన లేదు. విధానపర నిర్ణయమైన ఇలాంటి అంశంలో కోర్టులు జోక్యం చేసుకోలేవు' అని ధర్మాసనం స్పష్టం చేసింది.