Woman: మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు..తెలిసినవారే ఈ ఘాతుకానికి పాల్పడిన వైనం..!
Woman: మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు..తెలిసినవారే ఈ ఘాతుకానికి పాల్పడిన వైనం..!
కొల్లాపూర్ మండలం మొలచింతపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన..
చెంచు మహిళను గత 10 రోజులుగా ఓ ఇంట్లో నిర్బంధించి హింసించిన దుర్మార్గులు..
బాధితురాలిని వివస్త్రను చేసి శరీరంపై వాతలు పెట్టిన వైనం..
తెలిసినవారే ఈ ఘాతుకానికి పాల్పడిన వైనం..
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొల్లాపూర్ మండలం మొలచింతపల్లిలో ముగ్గురు వ్యక్తులు ఓ చెంచు మహిళను గత 10 రోజులుగా ఓ ఇంట్లో నిర్బంధించి చిత్ర హింసలకు గురిచేశారు. వివస్త్రను చేసి విచక్షణ రహితంగా కొట్టడంతో పాటు వాతలు పెట్టారు. గ్రామస్తుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని ఆ దుర్మార్గుల చెర నుంచి కాపాడారు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అలాగే కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి పరిధిలోని చెంచు భ్రమరాంబ కాలనీకి చెందిన కాట్రాసు ఈదన్న, ఈశ్వరమ్మ భార్యాభర్తలు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. 10 రోజుల కిందట దంపతులు గొడవపడ్డారు. దీంతో ఈశ్వరమ్మ ఊరు విడిచి వెళ్లిపోయింది.
దాంతో తన భార్య కనిపించడం లేదంటూ గ్రామంలో తెలిసినవారిని వాకబు చేశాడు. కానీ, ఎక్కదా ఆమె ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో ఈదన్న పొలాన్ని కౌలుకు చేస్తున్న అదే గ్రామానికి చెందిన బండి వెంకటేశ్, బండి శివుడు.. ఈశ్వరమ్మ సలేశ్వరంలో తలదాచుకున్నట్లు తెలుసుకున్నారు. అనంతరం ఆమెను రహస్యంగా మొలచింతపల్లికి తీసుకొచ్చే క్రమంలో మార్గమధ్యంలో విచక్షణ రహితంగా కొట్టి ఓ ఇంట్లో బంధించారు.
అంతటితో ఆగని ఆ దుర్మార్గులు ఈశ్వరమ్మను వివస్త్రను చేసి తీవ్రంగా హింసించారు. శరీరంపై వాతలు పెట్టారు. పచ్చికారం నూరి ఆమె కళ్లలో, మర్మాంగంలోనూ పెట్టారు. దాంతో బాధితురాలు నరకం అనుభవించింది. ఇక తన భార్య కనిపించడం లేదని పది రోజులుగా ఈదన్న వెతుకుతుండడంతో.. ఈ విషయం గ్రామం అంతా తెలియడంతో.. చివరికి ఈ పాశవిక చర్య బుధవారం వెలుగులోకి వచ్చింది.
ఇక కాట్రాసు ఈదన్న తాలూకు వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్న బండి వెంకటేశ్, బండి శివుడు.. ఈ చెంచు దంపతులను తమ పొలం వద్దనే జీతంకు పెట్టుకున్నారట. దంపతుల గొడవ కారణంగా భార్య ఈశ్వరమ్మ ఇల్లు విడిచి వెళ్లడాన్ని ఆసరగా చేసుకుని సదరు దుర్మార్గులు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు.
కాగా, ఈ ఘటనపై మొలచింతపల్లి గ్రామస్తులు బుధవారం సాయంత్రం కొల్లాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో పోలీసులు గ్రామానికి చేరుకుని నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలిని చికిత్స కోసం 108 వాహనంలో కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కొల్లాపూర్ ఎస్ఐ హృషికేశ్ తెలిపారు. ఈశ్వరమ్మకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ, ఆదివాసి చెంచుల సంఘం జిల్లా రాష్ట్ర నాయకులు గురువారం ములచింతల గ్రామానికి వస్తున్నట్లు తెలిసింది.