SIM cards: మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? ఒక వ్యక్తిపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చు?
SIM cards: మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? ఒక వ్యక్తిపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చు?
కొందరు ఎప్పటికప్పుడు నంబర్లు మార్చేస్తుంటారు. పాత నంబర్ పక్కన పడేసి కొత్తది ఎంచుకుంటూ ఉంటారు. కనీసం వాటిని బ్లాక్ కూడా చేయరు. ఒకవేళ మీరూ ఈ కోవకు చెందినవారే అయితే ఇంకోసారి మీరు కొత్త సిమ్ కార్డు కోసం వెళితే మీ అభ్యర్థన తిరస్కరణకు గురికావొచ్చు. ఎందుకంటే సిమ్ కార్డుల జారీపై పరిమితి ఉంది కాబట్టి! ఇంతకీ ఎన్ని సిమ్ కార్డులు ఓ వ్యక్తి తీసుకోవచ్చు? పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నదీ ఎలా తెలుసుకోవాలి?
ఫ్రీగా లభిస్తుండడంతో చాలామంది సిమ్ కార్డులను వాడేసి వాటిని బ్లాక్ చేయకుండానే పక్కన పడేస్తుంటారు. ఒక్కోసారి ఇలాంటివి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతుంటాయి. అంతేకాదు ఒక్కోసారి మనకు తెలియకుండానే మన పేరుపై కొందరు సిమ్ కార్డ్లు తీసుకుంటుంటారు. ఆధార్ దుర్వినియోగం చేసి ఈ తరహా మోసాలకు పాల్పడుతుంటారు. సిమ్ స్వాప్, మోసపూరిత సిమ్ కార్డుల జారీ వల్ల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈనేపథ్యంలో సిమ్ కార్డ్ జారీ నిబంధనల్ని డాట్ కఠినతరం చేసింది. దీని ప్రకారం సామాన్యులు ఒక ఆధార్ కార్డుతో గరిష్ఠంగా 9 సిమ్కార్డులు తీసుకొనే సదుపాయం మాత్రమే ఉంది. బర్క్లీ సిమ్ కార్డులు తీసుకోవడాన్ని కూడా నిషేధించింది
సిమ్ కార్డులు ఎన్ని ఉన్నాయి?
తమ ఆధార్ కార్డు పేరిట ఎన్ని సిమ్కార్డులు ఉన్నాయో తెలుసుకునేలా డాట్.. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP) అనే ప్లాట్ఫామ్ను తీసుకొచ్చింది. దీని సాయంతో మీ ఆధార్ కార్డ్ పై ఎన్ని సిమ్ కార్డులు జారీ చేశారో తెలుసుకోవచ్చు. అంతేకాదు మొబైల్ను ఎవరైనా చోరీ చేసినా, పోగొట్టుకున్నా దాన్ని బ్లాక్ చేసుకునేలా అవకాశం ఉంది. ఇందుకోసం ముందుగా sancharsaathi వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. అందులో "Citizen Centric Services” కింద కనిపించే అప్లికేషన్ “Know your mobile connections” పై క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయగానే మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే ఆ యూజర్ పేరిట ఉన్న మొబైల్ నంబర్ల జాబితా ప్రత్యక్షమవుతుంది. అందులో ఉన్న ఫోన్ నంబర్లు మీవేనా? కాదా? చెక్ చేసుకోండి. ఒకవేళ మీవి కాకపోతే వెంటనే అక్కడే బ్లాక్ చేసేయొచ్చు.