Rain Season: వాన కాలంలో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి..!
Rain Season: వాన కాలంలో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి..!
- వర్షాకాలంలో వేగంగా సీజనల్ వ్యాధుల వ్యాప్తి..
- కొన్ని రకాల ఆహార పదార్థాలతో అనారోగ్యం..
- ఆయా ఆహారా పదార్థాల్లో బ్యాక్టీరియా..
- శిలీంధ్రాలు వంటి వ్యాధికారకాలు వృద్ధి..
- రోగనిరోదక శక్తిని పొందేందుకు జాగ్రత్తలు తప్పనిసరి..
వర్షాకాలం ప్రారంభమవుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. జలుబు, ఫ్లూ, టైఫాయిడ్, మలేరియా డెంగ్యూ వంటి సమస్యలు వస్తాయి. వీటిలో కొన్ని దోమల ద్వారా వస్తాయి. మరికొన్ని ఇన్ఫెక్షన్లు వస్తాయి.
ఇలాంటి సమయంలో మనం రోగనిరోదక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. ఈ వాతావరణంలో తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటి వ్యాధికారకాలు వృద్ధి చెందుతాయి. ఈ కాలంలో కొన్ని ఆహారాలు అనారోగ్యానికి గురి చేస్తాయి. వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. వర్షాకాలంలో తినకూడని ఆ ఆహారాలు ఏవో చూద్దాం.
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, వర్షాకాలంలో వాటిని తినడం తగ్గించాలి. ఎందుకంటే ఈ సీజన్లో ఆకుకూరలు పండించే ప్రదేశాలు అపరిశుభ్రంగా మారుతాయి. చిత్తడి నేలల్లో పండిచేవి, రవాణా సమయంలో సరైన శ్రద్ధ తీసుకోని, బురద అంటుకునే ఆకుకూరలు తినకూడదు. వీటితో బ్యాక్టీరియా వల్ల వ్యాధులు రావచ్చు. ఈ సీజన్లో బ్రకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి వెజిటేబెల్స్పై పురుగులు ఉండే అవకాశం ఎక్కువ. వర్షాకాలంలో ఎక్కువ తేమ ఉండటం వల్ల ఆకుకూరలు త్వరగా పాడైపోతాయి. తడి వాతావరణంలో క్యాబేజీ వంటి ఆకుకూరల్లో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువ. వర్షాకాలపు తేమ వాతావరణంలో పాలు, పెరుగు, పనీర్ వంటి పాల ఉత్పత్తులలో బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. మామూలుగా వర్షాకాలంలో పాల ఉత్పత్తులు చాలా త్వరగా చెడిపోతాయి. అందుకే వీటిని తినడం తగ్గించాలి.
స్ట్రీట్ ఫుడ్స్ చాలా రుచికరంగా ఉంటాయి. కానీ అవి అనారోగ్యానికి కూడా దారితీస్తాయి. ఎందుకంటే ఈ కాలంలో ఈగలు, వ్యాధులను వ్యాప్తి చేస్తే ఇతర కీటకాలు పెరిగిపోతాయి. ఇవి స్ట్రీట్ ఫుడ్స్పై ఎక్కువగా వాలుతాయి. వ్యాపారులు వాటిని నిత్యం దూరంగా ఉంచలేరు కాబట్టి వాటిని తినకపోవడమే మంచిది. నీరు కూడా కలుషితమవుతుంది. ఆ నీటిని ఈ ఫుడ్స్ తయారీలో వాడవచ్చు. ఇలా తయారుచేసిన ఆహారాలు తింటే డైజెస్టివ్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. చేతులు కడుక్కోకుండా, అపరిశుభ్ర పద్ధతుల్లో చేసే ఆహారాలు జోలికి వెళ్లకూడదు. వర్షాకాలంలో పచ్చి కూరగాయలు (Raw vegetables) తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో పచ్చి కూరగాయలపై బ్యాక్టీరియా ఉండే అవకాశం ఎక్కువ. వర్షాకాలంలో వాతావరణం బ్యాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. పచ్చి కూరగాయలతో వ్యాపించే క్రిముల కారణంగా డయేరియా, వాంతులు, జ్వరం వంటి అనారోగ్యాలు రావచ్చు. అందుకే కూరగాయలను బాగా ఉడికించి, వేయించి లేదా ఆవిరిపై ఉడికించి తినాలి. వర్షాకాలంలో చేపలు, రొయ్యలు, పీతలు వంటి సీ ఫుడ్, రెడ్ మీట్ కలుషితం కావడానికి అవకాశం ఎక్కువ. ఈ సమయంలో ఇవి తాజాగా దొరకడం కష్టం. సరిగ్గా నిల్వ చేయని, పచ్చిగా తినే మాంసం, సీ ఫుడ్ వల్ల అనారోగ్యాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి కొన్ని నెలల పాటు వీటిని తినకూడదు. వర్షాకాలంలో పండ్లు కోసిన వెంటనే తినాలి. కట్ చేసి, తోలు తీసివేసిన చాలాసేపటి వరకు వీటిని పక్కన పెడితే అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. వీటిపై బ్యాక్టీరియా, శిలీంధ్రాలు సులభంగా చేరుతాయి, అవి త్వరగా చెడిపోతాయి. వీటిని తినడం వల్ల డయేరియా, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. అందుకే వాటికి దూరంగా ఉండటం మంచింది.