Railway: రైల్వేలో మహిళలకు ఇవి ప్రత్యేకం..?
రైల్వేలో మహిళలకు ఇవి ప్రత్యేకం..?
దూర ప్రాంతాలకు ప్రయాణమనగానే గుర్తొచ్చేది రైలే. ముఖ్యంగా మహిళలు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు రైల్వే శాఖ కొన్ని సదుపాయాలను కల్పిస్తోంది. సాధారణంగా రైళ్లలో సీనియర్ సిటిజన్ కోటా ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వారు ఈ కోటాలో టికెట్ బుక్ చేసుకోవచ్చు. అదే మహిళలకైతే 45 ఏళ్లే. పైగా లోయర్ బెర్త్ కేటాయిస్తారు.సీనియర్ సిటిజన్లు కాకుండా రైల్వేశాఖ మహిళల కోసం కొన్ని సీట్లు కేటాయిస్తుంది. ఒక వేళ కుటుంబంతో కాకుండా ఒంటరిగా ప్రయాణించాలనుకున్నప్పుడు ఈ కోటాలో టికెట్ ప్రయత్నించొచ్చు. రైళ్లలో మహిళలకు ప్రత్యేక బోగీ ఉంటుంది. అందులో పురుషులకు అనుమతి ఉండదు. 12 ఏళ్లలోపు బాలురకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది.నిబంధనలు ఉల్లంఘించి పురుషులు మహిళా కంపార్ట్మెంట్లోకి ప్రవేశిస్తే స్త్రీల ఫిర్యాదు మేరకు రైల్వేశాఖ చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది.1989 ఇండియన్ రైల్వే చట్టం ప్రకారం మిలటరీ సిబ్బందికి మాత్రమే మహిళల బోగీలోకి అనుమతి ఉంటుంది. ఇండియన్ రైల్వే చట్టం ప్రకారం మహిళా ప్రయాణికులు పొరపాటున టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తుంటే వారిని బయటకు పంపేందుకు టీటీఈకి అనుమతిలేదు. ఫైన్ చెల్లించి ఆ మహిళ తన ప్రయాణం కొనసాగించవచ్చు. తను ఒకవేళ ఫైన్ చెల్లించలేని స్థితిలో ఉంటే అప్పుడు కూడా టీటీఈకి తన మీద యాక్షన్ తీసుకునేందుకు ఎటువంటి అధికారం లేదు.ఒక వేళ ఆడవారిని ట్రైన్లోనుంచి దిగమని అడగాలన్నా, మాట్లాడాలన్నా కచ్చితంగా మహిళా కానిస్టేబులే అయ్యి ఉండాలి. మహిళల భద్రత కోసం భారత రైల్వే శాఖ సీసీటీవీలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలు రైల్వే ప్రాంగణంలో లేకపోతే.. దానిపై ఫిర్యాదు చేసే అధికారం మహిళలకు ఉంది.