Pawan Kalyan: నాకు ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శాఖలు కేటాయించారు.. ధన్యవాదాలు
Pawan Kalyan: నాకు ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శాఖలు కేటాయించారు.. ధన్యవాదాలు
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్..
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పర్యావరణం టెక్నాలజీ శాఖలు..
సంతోషం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్..
ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శాఖలు కేటాయించారని వెల్లడి..
ఏపీ డిప్యూటీ సీఎంగా నియమితుడైన జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు ఇతర శాఖలు కూడా కేటాయించడం తెలిసిందే. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక.. ఈ శాఖలన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవి, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవిగా తాను భావిస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలోని సమస్యలపై నాకు అవగాహన ఉంది..
2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న నేను ఉభయ తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించాను. 2019 ఎన్నికలకు ముందు ప్రజా పోరాట యాత్రను ప్రజల సమస్యల అవగాహన, మౌలిక సదుపాయాల కల్పనపై అధ్యయనం కోసమే చేపట్టాను. చాలా లోతుగా ఆనాడు స్వయంగా పరిశీలన జరిపాను. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతీ ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై బలమైన అవగాహన ఏర్పడింది.
గ్రామాల్లో సమస్యలు కళ్ళారా చూశాను..
విశాఖ మన్యంలో పర్యటిస్తున్నపుడు కురిడి అనే గిరిజన గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామ ఆడపడుచులు గుక్కెడు నీళ్ళ కోసం తాము పడుతున్న అవస్థలు చెబుతూ, అక్కడి బావిలో కలుషితమైపోయిన నీటిని చూపించారు. ఆ ప్రాంతంలోనే తోటవలస గ్రామానికి వెళ్లినప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆ ఊరివాళ్ళు వివరించారు. గోదావరి జిల్లాలకు వెళ్లినప్పుడు పలు మత్యకార గ్రామాలవాసులు తాగు నీటి కోసం ఎన్ని ప్రయాసలుపడుతున్నామో చెప్పారు. గ్రామీణ అభివృద్ధి - దేశాభివృద్ధి అనే నినాదం నామమాత్రంగా మిగిలిపోవడాన్ని గమనించాను. గుక్కెడు మంచి నీరు కోసం మైళ్ళ దూరం వెళ్లి ప్రయాసతో బిందెడు నీరు తెచ్చుకుంటున్న ఆడపడుచుల అవస్థలు చూసాను. కాలుష్యమయమైన జల వనరులనే తాగు నీరుగా తప్పని పరిస్థితులలో వాడుకుంటున్న పల్లెవాసులను గమనించాను. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లెలకు రక్షిత తాగు నీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తాను.
పర్యావరణం జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒక భాగం..
‘పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం’ అనేది జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి అని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒక పక్క పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందాలి అని నేను గట్టిగా కోరుకుంటున్నాను. అయితే ఆ అభివృద్ధి పర్యావరణానికి హితంగా జరగాలి. ఆధునిక సాంకేతికత మేళవించిన సురక్షితమైన పారిశ్రామిక అభివృద్ధి ఈ సమాజానికి అవసరం. విశాఖ ఎల్.జి. పాలిమర్స్ ప్రమాదాన్ని మనం ఏనాడూ మరచిపోలేము. ప్రజల ఆరోగ్యాలను హరించి వేయకుండా పరిశ్రమలు ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకునేలా పరిశ్రమలు ముందుకు వెళ్ళడానికి చేయూతనిస్తాము. భూ తాపాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేస్తున్న ప్రయత్నాలకు బాసటగా నిలుస్తాము. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తాం.
అటవీ సంపదను కాపాడుకుందాం..
వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తి నా మదిలో ఎప్పుడూ మారుమోగుతుంటుంది. ఒక్క వృక్షాన్ని రక్షించుకుంటేనే మానవ కోటికి ఎంతో మేలు కలుగుతున్నప్పుడు.. మరి లక్షలాది వృక్షాలను తన గర్భాన నిలుపుకున్న అడవి తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. అడవుల విధ్వంసమే కరవు కాటకాలకు హేతువు. అటువంటి అడవులను కంటికి రెప్పలా కాపాడతాం. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతాం. అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్ళవలసిందే. సామాజిక వనాలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తీర ప్రాంతాల్లో మడ అడవుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. శాస్త్ర, సాంకేతిక విభాగాలు మానవాళి శ్రేయస్సుకు, లోక కళ్యాణానికి అత్యంత అవశ్యం.
ప్రజా పంపిణీ, ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి..
అదే విధంగా జనసేన పార్టీ నుంచి మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించబోయే నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ లకు ప్రజా ప్రయోజనం కలిగిన, అభివృద్ధి సంబంధిత శాఖలు అప్పగించారు. పౌరసరఫరాలు, టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించడం సంతోషంగా ఉంది. నాదెండ్ల మనోహర్ నిర్వర్తించే ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం. ప్రజా పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేస్తాం. రేషన్ కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీపై ప్రత్యేక దృష్టిపెడతాం. అదే విధంగా రైతుల నుంచి పంటల కొనుగోలు విధానం, వారికి సొమ్ములు చెల్లించడంలో మెరుగైన విధానాలు అవలంబిస్తాం. రాష్ట్రంలో వరి రైతులకు పంట కొనుగోలు డబ్బులు అందించడంలో గత ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య పోకడలు, రైతుల వేదనలు స్వయంగా చూశాను. ఆ పరిస్థితులు రానీయం.
పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు..
రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి జరిగితే ఉపాధి అవకాశాలు చాలా పెరుగుతాయి. ఆహ్లాదకర పర్యాటకంతోపాటు, ధార్మిక, భక్తి పర్యాటకం అభివృద్ధిపై దృష్టి పెడతాం. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పర్యాటక కేంద్రాలలో మెరుగైన వసతులు కల్పించడంతోపాటు రాష్ట్రానికి ఒక బ్రాండ్ కల్పించడంపై దృష్టిపెట్టాలి. అదే విధంగా సినిమా రంగానికి రాష్ట్రంలో ప్రోత్సాహకర, స్నేహపూరిత వాతావరణం తీసుకువస్తాము. చిత్రీకరణ ప్రాంతాలలో సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఈ రంగంలో రాష్ట్ర యువతకు ఉపాధి దక్కేలా చూస్తాము.
వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఎనలేని సహకారం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి, ప్రజలతో నేరుగా సంబంధ బాంధవ్యాలు కలిగిన మంత్రిత్వ శాఖలు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జనసేన పార్టీకి కేటాయించిన శాఖల ద్వారా చిత్తశుద్ధితో ప్రజా సేవలు అందిస్తాం. నేను నిర్వర్తించబోయే శాఖలపై మరింత లోతైన అధ్యయనం జరిపి ప్రజలకు అత్యంత మేలైన ఫలాలను అందించడానికి శక్తి వంచన లేని కృషి చేస్తానని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ వాసులకు సవినయంగా తెలియచేస్తున్నాను.