New laws: జీరో ఎఫ్ఎఆర్.. ఆన్లైన్లో కీలక మార్పుల్లో కొన్ని..
New laws: జీరో ఎఫ్ఎఆర్.. ఆన్లైన్లో కీలక మార్పుల్లో కొన్ని..
దిల్లీ (పీపుల్స్ మోటివేషన్):-
వచ్చే వారం నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాల (భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్) తో నేర దర్యాప్తు, విచారణ ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. జీరో ఎఫ్ఎర్, ఆన్లైన్లో ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమన్ల జారీ, హేయమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయడం లాంటి మార్పులతో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ కొత్త చట్టాలపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర హోంమంత్రిత్వశాఖ కూడా భారీ కసరత్తు ప్రారంభించింది. దాదాపు 40 లక్షల మంది క్షేత్రస్థాయి సిబ్బందికి, 5.65 లక్షల మంది పోలీసులు, జైళ్ల అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులకు శిక్షణ ఇవ్వనుంది. గతేడాది భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియమ్ 2023 చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇవి బ్రిటిష్ వలసపాలన కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో అమల్లోకి రానున్నాయి.
కీలక మార్పుల్లో కొన్ని..
• బాధితుడు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనను ఫిర్యాదు చేయొచ్చు. దీంతో వేగవంతంగా చర్యలు తీసుకొనే వెసులుబాటు పోలీసులకు లభిస్తుంది.
• జీరో ఎఫ్ఎఆర్ ప్రకారం.. ఏ వ్యక్తి అయినా పోలీసుస్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయొచ్చు.
• అరెస్టు సందర్భాల్లో బాధితుడు సన్నిహితులు, బంధువుల తన పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా బాధితుడు తక్షణ సహాయం పొందే అవకాశం ఉంటుంది.
• అరెస్టుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. తద్వారా అరెస్టు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని బాధితుల కుటుంబికులు, స్నేహితులు తేలికగా తెలుసుకునే వీలుంటుంది.
• హేయమైన నేరాల్లో ఇక నుంచి ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరి. వారు సంఘటన స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తారు. ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి. దీనివల్ల దర్యాప్తులో నాణ్యత, విశ్వసనీయత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
• మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పరిష్కారానికి కొత్త చట్టాల్లో అధిక ప్రాధాన్యమి చ్చారు. ఈ నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లో పూర్తికావాలి. అంతేకాదు.. బాధిత మహిళలు, చిన్నారులకు ఉచిత ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి.
• ఇక సమన్లు ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పంపించొచ్చు.
• మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి.. బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. వారు లేనిపక్షంలో మహిళాసిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలి.
• బాధితులతోపాటు నిందితులు కూడా ఎఫ్ఎఆర్ నకళ్లను ఉచితంగా పొందే వీలుంది. వీటితోపాటు పోలీస్ రిపోర్టు, ఛార్జిషీట్, స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను 14 రోజుల్లోగా పొందవచ్చు.
• కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి, సకాలంలో న్యాయం అందేలా చేయడానికి న్యాయస్థానాలు కూడా గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి.
• సాక్షుల భద్రతను, వారి సహకారాన్ని దృష్టిలో ఉంచుకొని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి.
• అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి.
• మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్థులతోపాటు 15ఏళ్ల లోపు పిల్లలు, 60ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు పోలీస్ స్టేషన్కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది. వారు తాము నివాసమున్న చోటే పోలీసుల సాయం పొందొచ్చు.