JC Prabhakar: నాకు న్యాయం జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోండి..!
JC Prabhakar: నాకు న్యాయం జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోండి..!
గత ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగిందన్న మాజీ ఎమ్మెల్యే..
న్యాయం జరగకపోతే ఎస్పీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తానని వెల్లడి..
తన కొడుకు, కోడలు దీక్ష చేస్తారన్న జేసీ ప్రభాకర్ రెడ్డి..
ఈ విషయం చంద్రబాబు, ప్రభుత్వానికి సంబంధించినది కాదని వ్యాఖ్య తన వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనుకుంటే పార్టీకి రాజీనామా చేస్తానన్న టీడీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందన్నారు. తమను దొంగలుగా చిత్రీకరించారని అన్నారు. తననూ.. తన కొడుకును జైలుకు పంపారన్నారు. కావాలనే తన బస్సులపై తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు.
బీఎస్ 3 వాహనాలు విక్రయించిన వారు, రిజిస్ట్రేషన్ చేసినవారు ఇద్దరూ ఇంటికి పోయారన్నారు. తన బస్సులు సీజ్ చేసిన విషయంలో తాను ఎవరినీ వదిలిపెట్టబోనని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తనకు న్యాయం జరగాలని, లేనిపక్షంలో తన కొడుకు, కోడలు దీక్ష చేస్తారని తెలిపారు. న్యాయం జరగకపోతే తాను కూడా ఎస్పీ కార్యాలయం ముందు నిరాహార దీక్షకు దిగుతానన్నారు. తాను, తన భార్య డీటీసీ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు.
తాను ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబును ఏమీ అనట్లేదని, చంద్రబాబుకు తాను వ్యతిరేకం కాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత విషయమన్నారు. ఒకవేళ తన వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనుకుంటే పార్టీకి రాజీనామా చేస్తానని తెలిపారు. తనకు అన్యాయం జరిగిందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.