IRCTC: ఆన్లైన్ టికెట్ల బుకింగ్ పై.. ఆ ప్రచారం అవాస్తవం..!
IRCTC: ఆన్లైన్ టికెట్ల బుకింగ్ పై.. ఆ ప్రచారం అవాస్తవం..!
రైల్వే ఈ-టికెట్ల బుకింగ్పై జరుగుతోన్న ప్రచారంపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది.
ఐఆర్సీటీసీ (IRCTR)లో వ్యక్తిగత ఖాతాల ద్వారా తమకు కాకుండా బంధువులు, ఫ్రెండ్స్కి ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేస్తే జైలు శిక్ష, భారీ జరిమానా పడుతుందంటూ కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్న వార్తలపై రైల్వేశాఖ స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇవి ప్రజల్ని తప్పదోవపట్టించేవిగా ఉన్నాయని పేర్కొంది.
• పర్సనల్ యూజర్ ఐడీతో కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్.. ఎవరికైనా ఈ-టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
• ఒక ఐడీతో నెలకు 12 టికెట్లు పొందొచ్చు. ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకున్నవారైతే నెలలో 24 టికెట్లు వరకూ బుక్ చేసుకొనే సదుపాయం ఉంది.
• వ్యక్తిగత ఐడీలతో బుక్ చేసిన ఈ-టికెట్లు వాణిజ్యపరమైన విక్రయం కోసం ఉద్దేశించినవి కాదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే.. రైల్వే చట్టం -1989లోని సెక్షన్ 143 ప్రకారం నేరంగా పరిగణిస్తారని రైల్వే మంత్రిత్వశాఖ'ఎక్స్' వేదికగా స్పష్టం చేసింది.
అందువల్ల, రక్త సంబంధీకులు, ఒకే ఇంటిపేరు ఉన్నవారికి మాత్రమే రైల్వే ఈ-టికెట్లు బుక్ చేసేందుకు అవకాశం ఉందని, వేరే ఇంటిపేర్లు ఉన్నవారికి బుక్ చేయడంపై రైల్వేశాఖ ఆంక్షలు విధించినట్లు జరుగుతోన్నప్రచారాన్ని నమ్మవద్దు. ఇంటి పేరుతో సంబంధం లేకుండా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల పేరిట మీకు ఉన్న అవకాశం మేరకు ఈ-టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీ ఖాతా నుంచి టికెట్లు బుక్ చేసి వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం నేరం. కేవలం అధికారిక గుర్తింపు పొందిన ఏజెంట్లకు మాత్రమే థర్పార్టీ బుకింగ్ ద్వారా ఈ వెసులుబాటు ఉంటుంది. వారు మాత్రమే టికెట్లు బుక్ చేసి ఇతరులకు వికక్రయించే అధికారాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా ఈ నిబంధనల్ని అతిక్రమిస్తే.. చట్టపరమైన చర్యలు ఉంటాయని రైల్వే శాఖ హెచ్చరిస్తోంది.