Couple: సంపాదన ఎక్కువై ఏం చేయాలో అర్థం కాక.. సలహాలు ఇవ్వండి.. ఓ భార్యాభర్తల పరిస్థితి
Couple: సంపాదన ఎక్కువై ఏం చేయాలో అర్థం కాక.. సలహాలు ఇవ్వండి.. ఓ భార్యాభర్తల పరిస్థితి.
డబ్బు ఎలా ఖర్చు చేయాలో చెప్పాలని నెటిజన్ల సలహాలు కోరిన భార్యాభర్తలు.
బెంగళూరు జంటకు వినూత్న ఇబ్బంది..
దంపతులకు పిల్లలు కూడా లేని వైనం..
చాలా మందికి ఎంత సంపాదించినా తనివి తీరదు. ఇంకా ఇంకా సంపాదించాలని తెగ ఆశపడుతుంటారు.
కానీ బెంగళూరుకు చెందిన ఓ జంట మాత్రం భారీ ఆదాయంతో తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇంత డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కావడంలేదని బాధపడిపోతున్నారు. సలహాలు, సూచనలు ఇవ్వాలని నెటిజన్లను కోరారు.
బెంగళూరులో నివసిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ దంపతుల జంట నెలకు ఏకంగా రూ.7 లక్షలు సంపాదిస్తోంది. వారికి పిల్లలు లేరు, ఇంటి ఖర్చులు, పెట్టుబడులు పోనూ ఇంకా డబ్బు మిగులుతోందని, ఈ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కావడంలేదని వారిద్దరూ చెబుతున్నారు. సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ కోరుతున్నారు. భారతీయ నిపుణుల జీతాలు, ఆఫీస్ పరిస్థితులు, ఆర్థిక విషయాల గురించి చర్చించే ‘గ్రేప్‌వైన్’ అనే యాప్‌లో దంపతులు పోస్ట్ పెట్టగా ‘ఎక్స్’లోనూ చక్కర్లు కొడుతోంది. ‘గ్రేప్‌వైన్’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సౌమిల్ త్రిపాఠి ‘ఎక్స్’లో స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
‘‘ఇది నిజంగా అద్భుతం. ఒకప్పుడు భారతీయ వ్యాపారవేత్తలు మాత్రమే అధిక ఆదాయంతో సమస్యలు ఎదుర్కునేవారు. కానీ నేడు సాధారణ 30 ఏళ్ల వయసున్న ఉద్యోగ కేటగిరి ధనవంతులు కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు’’ అని త్రిపాఠి రాసుకొచ్చారు. కాగా దంపతుల వయసు 30 సంవత్సరాలు అని, ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అని పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది. నెల సంపాదన రూ.7 లక్షలు, వార్షిక బోనస్ మొత్తంలో రూ.2 లక్షలను మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతామని దంపతులు తెలిపారు. నెలవారీ ఖర్చులు రూ.1.5 లక్షలు అవుతాయని, మంచి ఏరియాలో నివసిస్తున్నామని, కారు ఉందని చెప్పారు.
ఈ ఖర్చులన్నీ పోనూ నెలాఖరుకు బ్యాంకు ఖాతాల్లో రూ.3 లక్షలకు పైగానే మిగిలి ఉంటుందని, ఈ డబ్బుని ఎలా ఉపయోగించాలో తెలియడం లేదని వారు పేర్కొన్నారు. ఖర్చు విషయంలో ఏమైనా సూచనలు ఉంటే ఇవ్వాలని దంపతులు కోరారు. కాగా జాబ్ మానేయాలని కొందరు, విదేశీ యాత్రలకు వెళ్లాలంటూ ఇంకొందరు ఇలా ఎవరికి తోచిన సలహాలు వాళ్లు ఇచ్చారు. జాబ్ మానేసి సొంతంగా వ్యాపారం చేయాలని, స్వచ్ఛంద సేవా సంస్థలు లేదా అనాథాశ్రమాలకు విరాళం ఇవ్వాలని మరికొందరు నెటిజన్లు తమకు తోచిన సలహాలు ఇచ్చారు.