భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు
భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు
పత్తికొండ జూన్ 17, పీపుల్స్ మోటివేషన్:
పత్తికొండలో సోమవారం బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక పాతపేటలోని అహలే సున్ని జామియా మసీద్ ఈద్గా నందు హఫీజ్ ఫారూఖ్ నిజామీ బక్రీద్ పండుగ విశిష్టతను, ప్రాముఖ్యతను ప్రసంగించారు. స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగ నిరాతిని వ్యాపింప చేయడమే బక్రీద్ పండుగ ఉద్దేశమని అన్నారు. అల్లా ఆదేశం ప్రకారం హజరత్ ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన హజరత్ ఇస్మాయిల్ ను బలి ఇవ్వడానికి తీసుకెళ్లే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలో నలుమూలల ఉండే ముస్లింలు ఈ పర్వదినాన్ని జరుపుకుంటారని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున సామూహిక ప్రార్ధనలో ముస్లింలు పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనాలు చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో జామియా మసీద్ కమిటీ సభ్యులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
బక్రీద్ విశిష్టత: ఖురాన్ ప్రకారం భూమిపై అల్లాహ్ ప్రవక్తలలో ఇబ్రహీం అలైహిస్సలాం ఒకరు. ఆయనే ఇప్పటి సౌదీ అరేబియాలోని మక్కా పట్టణంలో కాబా అనే ప్రార్థన మందిరాన్ని నిర్మించారు. ఇబ్రహీం ప్రవక్త కుమారుడు ఇస్మాయిల్. ఇబ్రహీం ప్రవక్తను అల్లాహ్ పలు రకాలుగా పరీక్షిస్తాడు. అందులో భాగంగా ఒకరోజు కలలో తన కుమారుడైన ఇస్మాయిల్ మెడపై కత్తితో కొస్తు ఉన్నట్టు కల వచ్చింది. అల్లాహ్ ఖుర్బానీ కోరుతున్నాడని ఒంటెను బలి ఇస్తాడు. మళ్లీ మళ్లీ అదే కల రావడంతో తన కుమారుడైన ఇస్మాయిల్ ను అల్లా బలి కోరుతున్నాడని భావించి కొడుకును బలి ఇవ్వబోతాడు, ఆ త్యాగాన్ని మెచ్చి అల్లాహ్ ఇస్మాయిల్ స్థానంలో ఓ జీవాన్ని బలి ఇవ్వమని జిబ్రయిల్ అనే దూత ద్వారా ఇబ్రహీం తెలియజేస్తాడు. అప్పటినుండి బక్రీద్ పండుగ పర్వదినాన జీవాన్ని బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది.బక్రీద్ పర్వదినాన ఖుర్బానీ కు గల ప్రాధాన్యం: బక్రీద్ పండుగ పర్వదినాన ముస్లింలు ఖుర్బానీ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఒక పొట్టేలు మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి అందులో ఒక భాగాన్ని నిరుపేదలకు పంచి పెడతారు. రెండో భాగాన్ని బంధువులకు ఆత్మీయులకు పంచి పెడతారు. మూడో భాగాన్ని తమకోసం ఉంచుకుంటారు. దీనిని కుర్బానీ అంటారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన హజ్ యాత్ర ఈ నెలలోని చేపడతారు.