రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువస్తాం: పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్
రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువస్తాం..
పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్
ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి సారిగా పట్టణానికి రాక..
ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం..
కర్నూలు, జూన్ 14 (పీపుల్స్ మోటివేషన్):-
ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తరలివచ్చేలా కృషి చేస్తానని పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆయన కర్నూలు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. ఐదు కోట్ల మంది ప్రజలకు మంత్రిగా సేవ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో మంత్రిగా ఎంపిక చేసి కీలక శాఖలను కేటాయించిన చంద్రబాబు నాయుడికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. తమ ప్రభుత్వంలో పెట్టుబడిదారులను ఆకర్షించి రాయితీలు కల్పిస్తామని చెప్పారు. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ తీసుకువచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ జోన్ ఉందని ఎయిర్‌పోర్ట్ కూడా ఉందన్నారు. ఇటీవలే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో మాట్లాడి విజయవాడ నుంచి కర్నూలుకు విమాన సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరినట్లు మంత్రి తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై చర్చిస్తామని చెప్పారు. ఇప్పుడే తమ ప్రభుత్వం కొలువుదీరిందని.. ఒకదాని తర్వాత ఒకదాన్ని స్టడీ చేసి ముందుకు వెళ్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కంటే 100 రెట్లు మంచి పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు.
అంతకుముందు కర్నూలులోని సుంకేసుల రోడ్డులో ఉన్న గోదా గోకులంలో టీజీ భరత్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత సెయింట్ జోసఫ్ కాలేజీ, మున్సిపల్ ఆఫీస్, ఎస్బీఐ సర్కిల్, గాంధీ నగర్, జిల్లా పరిషత్, రాజ్ విహార్ మీదుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యేలు కేఈ శ్యామ్ బాబు, దస్తగిరి, పార్థసారథి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆలూరు ఇంఛార్జీ వీరభద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి టీజీ భరత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. తనను ఆశీర్వదించిన ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల దీవెనలతోనే ఈ స్థాయిలో ఉన్నానన్నారు.