ఫుల్ సరుకుతో మందుబాబులు రెడీ - ఈసారి ముందుగానే జాగ్రత్త పడ్డారుగా.!
ఫుల్ సరుకుతో మందుబాబులు రెడీ
- ఈసారి ముందుగానే జాగ్రత్త పడ్డారుగా.!
నంద్యాల (పీపుల్స్ మోటివేషన్):-
మందుబాబులకు ఒక్కరోజు చుక్క లేకపోయినా ఏదో కోల్పోయినట్లే అనిపిస్తుంది. అలాంటిది ప్రభుత్వం వారికి భారీ షాక్ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏకంగా మూడు రోజులు దుకాణాలు ఉండవు అంటూ బాంబు పేల్చింది. అయినా సరే మందు బాబులు జంకలేదు. మమ్మల్ని ఎవరూ ఆపలేరు అంటూ తమలో తామే అనుకున్నట్లు ఉన్నారు. అందుకే జీవితంలో ముందుచూపు అవసరం అనుకుని, ముందుగానే తమకు కావలసినంత సరుకు తీసుకొచ్చేయాలని నిర్ణయించుకున్నారు.
మద్యం దుకాణాలు వద్దకు పరుగులు తీశారు. అయితే వారికి అక్కడ మరో ఊహించని పరిస్థితి ఎదురైంది. ఒక గూటి పక్షులు అన్నీ ఒక దగ్గరకి చేరినట్లు అప్పటికే అక్కడ భారీగా తమ కోవకు చెందిన వారు ఉన్నారు. అంతా ఆ చుక్క కోసమే వచ్చారు. ఇక చేసేదేం ఉంది అనుకుంటూ, ఎంత భారీగా లైన్లు ఉన్నా సరే సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ముందుకు కదిలారు. ఎంతో సమయం వేచి ఉన్న తరువాత, తమకు కావలసినంత సరకు రావడంతో, జీవితంలో మరో గొప్ప విజయం సాధించామంటూ సంతోషంపడ్డారు. ఆ సంతోషాన్ని తమ తోటివారితోనూ పంచుకున్నారు.
మందుబాబుల మందు చూపు..
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మద్యం దుకాణాల వద్ద మందు ప్రియులు బారులు తీరారు. సోమవారం నుంచి బుధవారం వరకూ మద్యం దుకాణాలు మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు చేయకూడదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంచే మద్యం దుకాణాలు మూసివేశారు. తిరిగి 6వ తేదీన ఉదయం మద్యం దుకాణాలు తెరుచుకుంటాయి. దీంతో ముందుగానే మద్యం సీసాలు విక్రయించి తమ ఇళ్ల వద్ద స్టాక్ పెట్టుకునేందుకు దుకాణాల వద్ద మందుబాబు ఎగబడ్డారు.