మీ దగ్గర చిరిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయా? ఈజీగా మార్చుకోండిలా
మీ దగ్గర చిరిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయా? ఈజీగా మార్చుకోండిలా!
చినిగిన, తడిసిన, పాడైన కరెన్సీ నోట్లను మార్చుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే వీటిని బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. కానీ పాడైన కరెన్సీ నోట్లను మార్చుకునే విధానం తెలియక చాలా మంది నష్టపోతుంటారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెబ్‌సైట్ ప్రకారం పాతబడిన, తడిసిన నోట్లు, రెండు ముక్కలుగా చిరిగిన నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. అవేంటే ఇప్పుడు చూద్దాం.తడిసిన నోట్లు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెబ్‌సైట్ ప్రకారం పాతబడిన, తడిసిన నోట్లు, రెండు ముక్కలుగా ఉన్న నోట్లు బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అలాగే వీటిని ప్రభుత్వ బకాయిలు చెల్లించేందుకు, పబ్లిక్ అకౌంట్స్కు క్రెడిట్ చేసేందుకు బ్యాంకులకు ఇవ్వవచ్చు. బ్యాంకులు కూడా వీటిని కచ్చితంగా స్వీకరించాల్సి ఉంటుంది.
మ్యుటిలేటెడ్ నోట్స్ :
మ్యుటిలేటెడ్ నోట్ అంటే సగానికి చినిగిన కరెన్సీ నోటు లేదా రెండు కంటే ఎక్కువ ముక్కలుగా చిరిగిపోయిన నోటు అని అర్థం. ఈ నోట్లను ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చు.
బాగా దెబ్బతిన్న నోట్లు :
చాలా పెళుసుగా ఉన్న నోట్లు, కాలిపోయినవి లేదా సాధారణంగా హ్యాండిల్ చేయలేని స్థితికి చేరిన, అతుక్కుపోయిన నోట్లను సాధారణ బ్యాంక్ బ్రాంచ్‌లలో మార్పిడి చేయలేము. కనుక ఇలాంటి నోట్లు ఉన్నవాళ్లు, వాటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. అక్కడ వాటిని ప్రత్యేక విధానంలో సరిచూసి, మీకు డబ్బులు తిరిగి చెల్లిస్తారు.
కరెన్సీ నోట్ల మార్పిడి పరిమితులు :
ఒక వ్యక్తి రోజుకు 20 నోట్లను లేదా గరిష్ఠం రూ.5,000 విలువైన నోట్లను మాత్రమే బ్యాంకుల్లో ఉచితంగా మార్చుకోవచ్చు. నోట్ల సంఖ్య 20 దాటినా లేదా రోజుకు రూ.5,000 కంటే ఎక్కువ విలువైన నోట్లు మార్చాల్సి వచ్చినా, బ్యాంకులు వాటిని ఆమోదించి రశీదు అందజేస్తాయి. పైగా సర్వీసు ఫీజు కూడా వసూలు చేస్తాయి. రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో నోట్లు మార్చాల్సి వస్తే, బ్యాంకులు ప్రామాణిక పద్ధతిని పాటిస్తాయి.
కరెన్సీ నోట్ల మార్పిడి విధానాలు :
నాన్-చెస్ట్ బ్రాంచ్‌ల్లో రోజుకు 5 నోట్లను మాత్రమే మార్చుకోవడానికి వీలవుతుంది. ఈ బ్యాంకులు డబ్బులు జమ చేసిన వారికి ఒక రసీదు ఇస్తాయి. ఎలక్ట్రానిక్ క్రెడిట్ కోసం మీ బ్యాంకు వివరాలు కూడా తీసుకుంటాయి. అయితే ఈ బ్యాంకులు, మీరు ఇచ్చిన చిరిగిన నోట్లు ఏ మేరకు డ్యామేజ్ అయ్యాయో అంచనా వేయలేకపోతే, వాటిని కరెన్సీ చెస్ట్ బ్రాంచ్లకు పంపిస్తాయి. వారు తగిన విధంగా పరిశీలించి మీకు రావాల్సిన డబ్బులను, మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
పెద్ద పరిమాణంలో నోట్లను మార్చుకోవడం ఎలా?
2022 ఏప్రిల్ 1 నాటి ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్ ప్రకారం, ఎవరైనా 5 కంటే ఎక్కువ నోట్లను సమర్పించినా, వాటి మొత్తం విలువ రూ.5,000 మించకుండా ఉంటే, వారు ఆ నోట్లను, బ్యాంక్ ఖాతా వివరాలను ఇన్సూర్డ్ పోస్ట్ ద్వారా సమీపంలోని కరెన్సీ చెస్ట్ బ్రాంచ్‌కు పంపించాలి. లేదా నేరుగా బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లి చిరిగిన నోట్లను మార్చుకోవచ్చు.
ఒకవేళ.. మీరు రూ.5,000 కంటే ఎక్కువ విలువైన మ్యుటిలేటెడ్ నోట్లు మార్చాలనుకుంటే, సమీపంలోని కరెన్సీ చెస్ట్ బ్రాంచ్‌కు వెళ్లాలి. వారు 30 రోజుల్లోపు మీ అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తారు.