Health tips: బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ పండ్లకు దూరంగా ఉండండి.
బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ పండ్లకు దూరంగా ఉండండి..
ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య బరువు పెరగడం. ఎక్కువ సమయం కార్యాలయాల్లో కూర్చోవడం, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల బరువు పెరుగుతారు. ఈ ఊబకాయాన్ని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదంగా మారుతుందని వైద్య నిఫుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలంటే వ్యాయామం చేయడంతో పాటు రోజువారి ఆహారంలో పలురకాల మార్పులు చేసుకోవాలి. పండ్ల విషయంలో మామిడి, అరటిపండు వంటి పండ్లు బరువు తగ్గడానికి పని చేయవని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అలాంటి పండ్లలో ఎక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. ఊబకాయాన్ని సకాలంలో నియంత్రించకపోతే అనేక ఇతర సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడం చాలా ముఖ్యం.
పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాటి వినియోగం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా, బరువు తగ్గే ప్రక్రియలో అవసరమైనదిగా పరిగణిస్తారు. అయితే కొన్ని రకాల పండ్లు బరువు తగ్గించడానికి బదులుగా బరువును పెంచుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవాళ్ళు కొన్ని రకాల పండ్లను ఆహారంలో తీసుకోకుండా ఉండడం ఉత్తమమని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. అవేంటంటే..? అరటిపండులో ఎక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. అంటే 7 నుంచి 8 అంగుళాల పొడవు, 118 గ్రాముల బరువు ఉన్న పండులో 105 కేలరీలు ఉంటాయి. బరువు పెరగాలనుకునే వారు అరటిపండ్లను తినొచ్చు. ప్రస్తుత సీజన్లో దొరికే మామిడి పండు చాలా రుచిగా ఉంటుంది. అయితే బరువు పెంచే పండ్లలో ఇది కూడా ఒకటి. దానికి దూరంగా ఉండాలి. ద్రాక్షలో చక్కెర, కొవ్వు రెండూ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి రెండూ బరువును పెంచుతాయని ఆరోగ్య నిఫుణులు చెబుతున్నారు. 100 గ్రాముల ద్రాక్షలో 67 కేలరీలు ఉంటాయి. 16 గ్రాముల చక్కెర ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే ద్రాక్షను తినకపోవడమే మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల అవోకాడోలో దాదాపు 160 కేలరీలు ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన కొవ్వుకు మంచి మూలం. ఎండుద్రాక్ష ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. అందుకే బరువు తగ్గాలనుకుంటున్న వాళ్లు ఇలాంటి పండ్లకు దూరంగా ఉండాలి. ఎన్ని వర్క్ అవుట్లు చేసినా.. ఇవి తింటే ఫలితం ఉండదు.