Custard Apple: సీతాఫలము చలికాలం పండు..
Custard Apple: సీతాఫలము చలికాలం పండు..
సీతాఫలము /రామాఫలము. సీతాఫలం ఒక పండు. ఇది వర్షాకాలం తరువాత విరివిగా దొరుకుతుంది. శీతాకాలం పండుగా పరిగణించే సీతాఫలం పోషకాల సమాహారం. కొన్ని రకాల అనారోగ్యాల నివారణి. మరెన్నో సుగుణాలున్న ఈ పండు గురించి వివరింగా తెలుసుకుందాం. ఈ కాలంలో మూడు నెలలకు పైగా లభిస్తుంది సీతాఫలం. ఈ పండు రామాఫలం, లక్ష్మణఫలం రకాల్లోనూ దొరుకుతుంది. చూడడానికి ఒకే విధంగా ఉన్నా.. రుచి, వాసనలో కాస్త తేడా ఉంటుంది. సీజన్ వస్తోందంటే చాలు... కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలాలు. ఈపేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేవో అనిపించకమానదు. అంతేకాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేవో అనిపిస్తుంది.
మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి అనుబంధం ఎక్కువ. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి. సీతాఫలం అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్నే కస్టర్డ్ యాపిల్ అనీ షుగర్ యాపిల్ అనీ పిలుస్తారు. ఇది దక్షిణ అమెరికా దేశాలతో పాటు మనదేశంలోనూ విరివిగా పండుతుంది. పండుగా తినడంతోపాటు స్వీట్లు, జెల్లీలు, ఐస్క్రీములు, జామ్లు చేస్తుంటారు. మనందరికీ పండుగానే సుపరిచితమైన ఇది ఛత్తీస్ ఘడ్ వాసులకు మాత్రం అద్భుత ఓషధీఫలం.సీతా ఫలాలు - ఔషధ గుణాలు
దీని ఆకులు, బెరడు, వేరు... ఇలా అన్ని భాగాల్నీ అక్కడ పలు వ్యాధుల నివారణలో వాడతారట. మనదగ్గర కూడా చాలామంది సెగ్గడ్డలకు వీటి ఆకుల్ని నూరి కట్టుకడతారు. వీటిఆకులకు మధుమేహాన్ని తగ్గించడంతోపాటు బరువు కూడా తగ్గించే గుణం ఉందని ఇటీవల కొందరు నిపుణులు చెబుతున్నారు. బెరడుని మరిగించి తీసిన డికాక్షన్ డయేరియాని తగ్గిస్తుందట. అలాగే ఆకుల కషాయం జలుబుని నివారిస్తుందట. పోషకాలు: 100గ్రా. గుజ్జు నుంచి 94 క్యాలరీల శక్తి, 20-25గ్రా. పిండిపదార్థాలు, 2.5గ్రా. ప్రొటీన్లు, 4.4గ్రా. పీచూ లభ్యమవుతాయి. ఇంకా కెరోటిన్, థైమీన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇలా మేలు లి ఈ ఫలాన్ని రసంరూపంలో కాకుండా నేరుగా తినడమే మంచిది. ఎందుకంటే గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది.
• పండు గుజ్జును తీసుకుని రసంలా చేసి.. పాలు కలిపి పిల్లలకు తాగించాలి సత్వర శక్తి లభిస్తుంది.
• ఎదిగే పిల్లలకు రోజూ ఒకటి, రెండు పండ్లు తినిపిస్తే మంచిది. బలవర్ధకమే కాదు ఫాస్పరస్, క్యాల్షియం, ఇనుము లాంటి పోషకాలు ఎముకల పరిపుష్టికి తోడ్పడతాయి.
• మలబద్ధకంతో బాధపడేవారికి ఈ పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది. రోజూ తినగలిగితే ఎంతో మార్పు కనిపిస్తుంది.
• గుండె, కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు.. దీన్ని అల్పాహారంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
• డైటింగ్ నియమాలు పాటించే వారు సైతం ఈ ఫలాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు.
• పండులోని సల్ఫర్ చర్మవ్యాధుల్నీ తగ్గిస్తుంది.
• సీతాఫలం గుజ్జు శరీరంలోని క్రిములు, వ్యర్థపదార్థాలను వెలుపలికి పంపించి వేస్తుంది.
• ఒక్క సీతాఫలం పండే కాదు.. ఆకులు ఉపయోగపడతాయి. ఆకుల్లోని హైడ్రోస్థెనిక్ ఆమ్లం చర్మసంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. ఆకుల్ని మెత్తగా నూరి.. కాస్త పసుపు కలిపి.. మానని గాయాలు, గజ్జి, తామర ఉన్న చోట పూతగా రాస్తే సరిపోతుంది.
• ఆకుల్ని మెత్తగా నూరి బోరిక్ పౌడర్ కలిపి మంచం, కుర్చీల మూలల్లో ఉంచితే.. నల్లుల బెడద ఉండదు.
• సీతాఫలం బెరడును కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడేవారికి ఔషధంగా ఇస్తుంటారు.
• సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. అయితే కళ్లల్లో పడకుండా చూసుకోవాలి.
• గర్భిణులు ఈ పండును సాధ్యమైంత తక్కువగా తినాలి. పొరబాటున గింజలు లోపలికి పోతే గర్భస్రావం అయ్యే ప్రమాదముంది. గమనిక: మోతాదుకు మించి తీసుకోకూడదు. కడుపులో మంట, ఉబ్బరం బాధిస్తాయి. అలాంటప్పుడు వేడినీరు తాగినా.. అరచెంచా వాము లేదా ఉప్పు నమిలినా ఉపశమనం లభిస్తుంది.
• మధుమేహ వ్యాధి గ్రస్తులు, వూబకాయులు ఈ పండ్లను వైద్యుల సలహాతో తీసుకోవాలి.
• జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ సమస్యలో బాధపడేవారు.. సీతాఫలాన్ని పరిమితంగా తీసుకోవడం మంచిది. సీతాఫలంలో సి విటమిన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. నోటిలో జీర్ణరసాలను ఊరేలా చేసే శక్తి అధికం ఈ పండుకు. ఇందులో ఉండే మెగ్నీషియం శరీరంలోని కండరాలకు విశ్రాంతినిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. కాల్షియం ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది, పీచుపదార్థాలు... మలబద్ధకంతో బాధపడేవారికి మంచి మందు. ఇన్ని లాభాలున్నా మధుమేహ రోగులు వీటికి దూరంగా ఉండటమే మేలు. ఎందుకంటే వీటిలో ఉండే చక్కెరల శాతం చాలా ఎక్కువ. ఉబ్బసం రోగులు వైద్యుల సలహా తీసుకుని తినాలి. సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు, భోజనం చేశాకే తినాలి. తిన్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.
లక్షణాలు
* చిన్న వృక్షం.
* నిశితాగ్రంతో దీర్ఘవృత్తాకారం లేదా దీర్ఘచరురస్రాకారంలో ఉన్న సరళ పత్రాలు.
* కాండాగ్రాలలో గాని, పత్రాభిముఖంగా గాని ఏర్పడిన ఏకాంత లేదా నిశ్చిత సమూహాలలో ఏర్పడిన ఆకుపచ్చని రంగుతో కూడిన తెలుపు పుష్పాలు.
* గుండ్రంగా ఆకుపచ్చగా, నొక్కులున్న సంకలిత ఫలం. ఇది చాలా దేశాలలో లభ్యమవుతుంది. వాటిలోభారతదేశం. ఇక్కడ ఆంధ్రప్రాంతములో శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం లో ఈ ఫలములు అత్యధికంగా లభ్యమవుతాయి. ఇక్కడ నుండి కోల్ కతా, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం కు ఎక్కువుగా కొనుగోలు చేసి తీసుకుపోతుంటారు, ముఖ్యంగా కలకత్తా ప్రాంతంలో ఈ పండ్లు కు ఎక్కువ గిరాకీ ఉంది.
ఉపయోగాలు
* సీతాఫలం మంచి రుచికరమైన ఆహారం. వీనిలో కాల్షియమ్ హొసమృద్ధిగా ఉంటుంది.
* దీనిలో విటమిన్ 'సి' సంవృద్ధిగా దొరుకుతుంది.
* ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేటందుకు దీనిలో కల పీచుపదార్ధం తోడ్పడుతుంది.
* సీతాఫలం అల్సర్లను నయం చేస్తుంది. ఎసిడిటీకి చెక్ పెడుతుంది. ఇందులో స్మూత్ స్కిన్ టోన్ అందించే సూక్ష్మపోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడి స్కిన్ మెరుస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.