నంద్యాల ఎంపీ విజేత డాక్టర్. బైరెడ్డి శబరి
నంద్యాల ఎంపీ విజేత డాక్టర్. బైరెడ్డి శబరి
- పార్లమెంట్ లో అడుగుపెట్టనున్న నంద్యాల తొలి మహిళ
- చరిత్ర సృష్టించిన డాక్టర్. బైరెడ్డి శబరి
- 1.17 లక్షల భారీ మెజారిటీతో డాక్టర్. బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీ గా విజయం
- శబరి గెలుపుతో ఆనందోత్సవం లో బైరెడ్డి అనుచరులు
- భారతదేశ చిత్రపటంలో నంద్యాలకు ప్రత్యేక గుర్తింపు
- దేశచరిత్రలోనే అత్యున్నత కీలక పదవులు అధిరోహించిన నంద్యాల ఎంపీలు
- భారత రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి, భారత ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు లు
- భారత రాజ్యాంగంలోనే కీలక పదవులైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి పదవులకు పంపి దేశంలోనే ఏకైక లోక్ సభ నియోజకవర్గంగా నంద్యాలకు ప్రత్యేక గుర్తింపు.
- నంద్యాల నుంచి తొలిమహిళా ఎంపీ గా లోక్ సభలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించబోతున్న డాక్టర్.బైరెడ్డి శబరి
నంద్యాల, జూన్ 04 (పీపుల్స్ మోటివేషన్):-
1952 వ సంవత్సరంలో నంద్యాల లోక్ సభ నియోజకవర్గం ఏర్పడింది, తదనంతరం కూడా నంద్యాల లోక్ సభ నియోజకవర్గంలో అనేక మార్పులు జరిగాయి. స్వాతంత్ర్యం అనంతరం 1952 లో జరిగిన ఎన్నికల్లో మొదటి పార్లమెంట్ సభ్యులుగా స్వతంత్ర అభ్యర్థి రాయసం శేషగిరిరావు కాంగ్రెస్ అభ్యర్థి సూడా రామిరెడ్డిపై విజయం సాధించారు. అనంతరం పలు కారణాలవల్ల నంద్యాల లోక్ సభ నియోజకవర్గం రధ్ధయ్యింది. నంద్యాల లోక్ సభ నియోజకవర్గంలోని ప్రాంతాలను కర్నూలు, మార్కాపురం నియోజకవర్గాలలో విలీనం చేశారు. దీంతో జిల్లాలో కర్నూలు, ఆదోని, నంద్యాల, మార్కాపురం లోక్ సభ నియోజకవర్గాలుగా ఏర్పాటు అయ్యాయి. 1957 లో ఎన్నికలు జరిగాయి. ఆదోని నుంచి పెండెకంటి వెంకటసుబ్బయ్య, కర్నూలు నుంచి ఉస్మాన్ అలీఖాన్, మార్కాపురం నుంచి సి. బాలిరెడ్డిలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా విజయం సాధించారు. మళ్ళీ 1962 లో జరిగిన ఎన్నికల్లో కర్నూలు నుంచి యశోదారెడ్డి, ఆదోని నుంచి పెండెకంటి వెంకటసుబ్బయ్యలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక కాగా మార్కాపురం నుండి జి. ఎల్లమంధారెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1967 వ సంవత్సరం ఎన్నికలు జరిగే నాటికీ తిరిగి నంద్యాల ప్రత్యేక పార్లమెంట్ నియోజకవర్గంగా అవతరించింది. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపి నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. 1977 వ సంవత్సరంలో నీలం సంజీవరెడ్డి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ నుండి ఆ పార్టీకి ఎంపికైన ఏకైక అభ్యర్థిగా పార్లమెంట్ లో నీలం సంజీవరెడ్డి అడుగుపెట్టారు. ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి భారత రాష్ట్రపతిగా కూడా ఎన్నుకోబడి ఆ పదవికే వన్నె తెచ్చారు. పెండెకంటి వెంకటసుబ్బయ్య 5 సార్లు నంద్యాల లోక్ సభ నుండి విజయం సాధించి సిల్వర్ జూబ్లీ పార్లమెంటరియన్ గా గుర్తింపు పొందారు, అలాగే కేంద్ర మంత్రిగా, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలకు గవర్నర్ గా, ఎన్నో ఉన్నత పదవులు చేపట్టారు. 1991 లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అప్పటి మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ లో మెజారిటీ రావడంతో పీవీ నరసింహారవును కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా చేసింది. అప్పటి నంద్యాల చిట్టింగ్ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి నంద్యాల లోక్ సభ నుంచి పీవీ నరసింహారావును పోటీకి ఆహ్వానించారు. 1991 లో నంద్యాల లోక్ సభకు ఉప ఎన్నిక జరిగింది. తెలుగువారు ప్రధాని హోదాలో పీవీ పోటీ చేస్తుండడంతో టీడీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు టీడీపీ నుంచి పీవీ పై పోటీ పెట్టలేదు. బిజెపి మాత్రం పీవీ పై పోటీ పెట్టింది. ఆ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి బంగారు లక్ష్మణ్ పై 580085 లక్షల భారీ మెజారిటీ సాధించి దేశంలోనే రికార్డ్ సాధించి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నమోదు చేసి పీవీ నరసింహారావు నంద్యాల ఎంపీ గా విజయం సాధించారు. తిరిగి 1996లో జరిగిన ఎన్నికలలో పీవీ నరసింహారావు పోటీ చేసి విజయం సాధించినప్పటికీ నంద్యాల ఎంపీ గా రాజీనామా చేశారు. పునర్విభజనకు ముందు నంద్యాల ఎంపీ సెగ్మెంట్ లో కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, పాణ్యం, నందికొట్కూరు, నంద్యాల, ఆత్మకూరు, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, పునర్విభజన తర్వాత నంద్యాల ఎంపీ పరిధిలో ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 1952 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూరా రామిరెడ్డి పై స్వతంత్ర అభ్యర్థి రాయసం శేషగిరిరావు 6604 వేల మెజారిటీతో గెలుపొందారు. 1957 (ఆదోని) బి ఎస్ పి అభ్యర్థి వై జి గౌడ్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి. వెంకటసుబ్బయ్య విజయం సాధించారు. 1957 ( మార్కాపురం ) కాంగ్రెస్ అభ్యర్థి సి. బాలిరెడ్డి గెలుపొందారు. 1962 లో (ఆదోని) ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి పి. వెంకటసుబ్బయ్య గెలిచారు. 1962 లో ( మార్కాపురం ) కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి జి. యల్లమందారెడ్డి విజయం సాధించారు. 1967 లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎల్లారెడ్డి, సిపిఐ నుంచి స్వామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి పి. వెంకటసుబ్బయ్య పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థి పి వెంకటసుబ్బయ్య గెలుపొందారు. 1971 లో కాంగ్రెస్ (ఎన్) అభ్యర్థి గా పోటీచేసిన అంకిరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి. వెంకటసుబ్బయ్య గెలిచారు. 1977 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి. వెంకటసుబ్బయ్యపై జనతా పార్టీ అభ్యర్థి నీలం సంజీవరెడ్డి 33743 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1978 లో ఉప ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థి గోమాంగో పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి. వెంకటసుబ్బయ్య గెలుపొందారు. 1980 లో కాంగ్రెస్ ( యు ) పార్టీ అభ్యర్థి ఆసిప్పాషా పై కాంగ్రెస్ అభ్యర్థి పి. వెంకటసుబ్బయ్య 41000 వేల మెజారిటీతో గెలుపొందారు. 1984 లో కాంగ్రెస్ అభ్యర్థి పి. వెంకటసుబ్బయ్య పై టీడీపీ అభ్యర్థి మద్దూరు సుబ్బారెడ్డి 50265 ఓట్లతో విజయం సాధించారు. 1989 లో టీడీపీ అభ్యర్థి మద్దూరు సుబ్బారెడ్డి పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొజ్జా వెంకటరెడ్డి 56262 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 1991 లో బీజేపీ అభ్యర్థి గా ఎస్ పి వై రెడ్డి, టీడీపీ అభ్యర్థి గా చల్లా రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గంగుల ప్రతాప్ రెడ్డి లు పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డి 188765 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1991 ఉప ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి గా మండ్ల సుబ్బారెడ్డి, బీజేపీ అభ్యర్థి గా బంగారు లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పీవీ నరసింహారావు పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థి పీవీ నరసింహారావు 580035 భారీ మెజారిటీతో విజయం సాధించారు. 1996 లో ఎన్టీఆర్ టీడీపీ అభ్యర్థి గా బైరెడ్డి శేషశయనారెడ్డి, టీడీపీ అభ్యర్థి గా భూమా నాగిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గా పీవీ నరసింహారావు లు పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థి పీవీ నరసింహారావు 98530 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు. 1996 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీవీ రంగయ్యనాయుడుపై టీడీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి 440142 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 1998 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డి పై టీడీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి 4650 ఓట్లతో గెలుపొందారు. 1999 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డి పై టీడీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి 72609 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా శోభా నాగిరెడ్డి పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ పి వై రెడ్డి 111679 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009 లో టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ పి వై రెడ్డి 90847 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014 లో టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పై వైస్సార్సీపీ అభ్యర్థి ఎస్ పి వై రెడ్డి 105766 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి పై వైస్సార్సీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి 250119 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థి గా పోచా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా డాక్టర్. బైరెడ్డి శబరి పోటీ చేశారు.