AP Govt: పథకాలకు ఆ పేర్లే కొనసాగించండి..!
AP Govt: పథకాలకు ఆ పేర్లే కొనసాగించండి..!
గత ప్రభుత్వంలో పథకాలకు ఉన్న పేర్లను తక్షణం తొలగించాలని సూచన
పార్టీ రంగులు..జెండాలతో ఉండే ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లు..పాస్ పుస్తకాలు..ధ్రువీకరణ పత్రాలను నిలిపేయాలి ప్రభుత్వ ఆదేశం
ఈ ఆదేశాల్లో ఎలాంటి మార్పులు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వ హెచ్చరిక
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..పథకాల అమలు, పేర్లు కొనసాగింపునకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసింది. గత సర్కార్ ప్రవేశ పెట్టిన పథకాల పేర్లను మార్చింది.
2019 ఏడాదికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. 2019 – 24 మధ్య ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు పేర్లను తొలగించాలని సూచించింది. మంత్రి డొలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు పేర్లని మారుస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజాగా గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన లోగోలు, సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.పాస్ పుస్తకాలు, ధ్రువీకరణ పత్రాల్లో ఎలాంటి ఫొటోలు, రంగులు, రాజకీయ పార్టీ జెండాలు ఉండేందుకు వీల్లేదని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019-24 మధ్య అమలు చేసిన కొన్ని పథకాలకు పేర్లు మార్చామని ఆమేరకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపింది. గత ప్రభుత్వంలో పథకాలకు ఉన్న పేర్లను తక్షణం తొలగించాలని ఆదేశించింది. కొత్త పేర్లు ఖరారు చేసేంత వరకూ సదరు పథకాల జనరల్ పేర్లను కొనసాగించాలని స్పష్టం చేసింది. పార్టీ రంగులు, జెండాలతో ఉండే ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లు, పాస్ పుస్తకాలు, లబ్ధిదారుల పుస్తకాలు, ధ్రువీకరణ పత్రాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ధ్రువీకరణ పత్రాలు, పాస్ పుస్తకాలు, ఇతర పత్రాలు జారీ చేయాల్సిన నమూనాలను కూడా జతపరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల్లో ఎలాంటి మార్పులు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది.