Ali: రాజకీయాలకు గుడ్ బై..ఓ కామన్ మేన్ గా ఉంటా..!
Ali: రాజకీయాలకు గుడ్ బై..ఓ కామన్ మేన్ గా ఉంటా..!
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన కమెడియన్ అలీ..
నేడు ఓ వీడియో సందేశం విడుదల..
ఇక నుంచి తాను ఏ పార్టీకీ చెందిన మనిషిని కాదని వెల్లడి..
ఓ కామన్ మేన్ గా ఉంటానని స్పష్టీకరణ సినిమాలపైనే దృష్టి కేంద్రీకరిస్తానని వివరణ..
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇవాళ ఓ వీడియో ద్వారా తన సందేశాన్ని వినిపించారు. తాను ఇప్పుడు ఏ పార్టీకీ చెందినవాడ్ని కాదని స్పష్టం చేశారు. ఇక నుంచి తాను ఒక కామన్ మేన్ అని తెలిపారు. ఇప్పటి నుంచి సినిమాలు చేసుకుంటానని వెల్లడించారు.
"నాడు పెద్దాయన డాక్టర్ డి. రామానాయుడు కోసం నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. బాలనటుడిగా అనేక సినిమాలు చేసిన తర్వాత, ఒక వయసు వచ్చిన నేపథ్యంలో, ప్రేమఖైదీ చిత్రం ద్వారా అవకాశం ఇచ్చి నన్ను నటుడుగా నిలబెట్టిన వ్యక్తి నిర్మాత రామానాయుడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిననన్ను నటుడుగా నిలబెట్టిన వ్యక్తి నిర్మాత రామానాయుడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన తర్వాత, ప్రేమఖైదీ చిత్రంతో నా కెరీర్ లో మరో అధ్యాయం మొదలైంది. రామానాయుడు బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేస్తూ... నువ్వు కూడా రావాలి రా అనడంతో ఆనాడు ఆయన కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. మీ కోసం తప్పకుండా వస్తాను గురువు గారూ! మీ సినిమా ప్రేమ ఖైదీ తర్వాతే మళ్లీ ఒక ఆర్టిస్ట్ గా మరో మెట్టుకు ఎదిగాను... మీ కోసం తప్పకుండా వస్తాను అని చెప్పి టీడీపీ హయాంలో రాజకీయాల్లోకి వెళ్లాను.దాదాపు 20 ఏళ్లు ఒకే పార్టీలో కొనసాగాను. ఆ తర్వాత ఈ పార్టీ (వైసీపీ) లోకి రావడం జరిగింది. మొదట నాకు అన్నం పెట్టింది తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు ప్రేక్షక దేవుళ్లు, నా నిర్మాతలు, నా దర్శకులు, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజికి ఎదిగాను, 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను, దాదాపు 6 భాషల్లో 1200 పైచిలుకు సినిమాలు చేశాను.
నాకు దయాగుణం ఉంది... కాబట్టి రాజకీయ బలం కూడా తోడైతే పది మందికీ సాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. అంతే తప్ప, రాజకీయాలు చేయాలని మాత్రం రాజకీయాల్లోకి రాలేదు.
ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది... నేను ఏం చేస్తే బాగుంటుంది అని నలుగురినీ చూసి నేను మా నాన్న గారి పేరు మీద ట్రస్టు స్థాపించాను. గత 16 ఏళ్లుగా ట్రస్టు ద్వారా సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నాను. కరోనా సంక్షోభ సమయంలోనూ ఆపన్నులను ఆదుకున్నాను. చుట్టాల్లోనూ, బయటి వాళ్లలోనూ చాలామందిని నేను చదివించాను. నా ఆదాయంలో 20 శాతం ట్రస్టుకు కేటాయిస్తుంటాను. విదేశాల్లో ఏదైనా ఈవెంట్లు చేస్తే, వచ్చే ఆదాయంలో 60 శాతం ట్రస్టుకే అందిస్తుంటాను.
నేను ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదు. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గురించే మాట్లాడతాను... మా పార్టీ ఎమ్మెల్యేలను, మా పార్టీ నాయకుడ్ని పొగుడుతానే తప్ప, ఇతర పార్టీల్లోని నేతలను ఒక మాట అనడం కానీ, వారి వ్యక్తిగత జీవితాలను విమర్శించడం కానీ చేయలేదు. నేను ఎవరినైనా ఒక్క మాట అన్నట్టు మీకు ఎక్కడా కనిపించదు.
ఇవాళ నేను మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే... నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ మద్దతుదారుడ్ని కాదు, నేను కేవలం ఒక సాధారణ పౌరుడ్ని. ఇక నుంచి నేను ఒక కామన్ మేన్ లాగేఉండి నా సినిమాలేవో నేను చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ మాట చెప్పడానికే మీ ముందుకు వచ్చాను. ప్రతి ఐదేళ్లకోసారి అందరూ ఎలా వెళ్లి ఓటేసి వస్తారో, నేను కూడా ఓ సాధారణ పౌరుడిలా వెళ్లి ఓటేసి వస్తాను. ఇంతటితో రాజకీయాలకు స్వస్తి. గుడ్ బై" అంటూ అలీ ప్రకటన చేశారు.
అలీ 2019 నుంచి వైసీపీలో కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయనకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి కూడా ఇచ్చారు.